కోవిడ్-19: రాష్ట్ర పోలీసుల‌ను ప్ర‌శంసించిన కేంద్ర బృందం

కోవిడ్-19: రాష్ట్ర పోలీసుల‌ను ప్ర‌శంసించిన కేంద్ర బృందం

రాష్ట్రంలో కోవిడ్-19పై క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి వచ్చిన కేంద్ర బృందం ఆదివారం హైదరాబాద్‌లో రెండో రోజు పర్యటన కొనసాగించింది. లాక్ డౌన్ నేథ్యంలో తెలంగాణ పోలీసులు తీసుకుంటున్న చర్యలపై పోలీసు ఉన్నతాధికారులతో కేంద్ర బృందం వివరాలు అడిగి తెలుసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం సభ్యులు ఆరుగురు డీజీపీతో భేటీ అయ్యారు. కోవిద్- 19 వైరస్ నివారణకు రాష్ట్రంలో పోలీస్ శాఖ చేపట్టిన చేపట్టిన చర్యలను డీజీపీ కార్యాలయంలో పరిశీలించారు.

రాష్ట్రంలో లాక్ డౌన్ అమలుకు పోలీస్ శాఖ చేపట్టిన చర్యలు, ఇతర వస్తువుల పంపిణీ, కంటైన్మెంట్ ప్రాంతాల్లో చేపట్టిన కట్టడి, కరోనా ఆస్పత్రులు, ఐసోలేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు, మెడికల్ సిబ్బంది చేపట్టిన చర్యలు, వలస కార్మికులకు అందిస్తున్న సహాయ సహకారాలు తదితర విషయాలపై తెలంగాణ పోలీస్ చేపట్టిన చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది.

ఈ కేంద్ర బృందంలో భారత ప్రభుత్వ జల శక్తి శాఖ అడిషనల్ సెక్రటరీ అరుణ్ బరోకా, పబ్లిక్ హెల్త్ సీనియర్ స్పెషలిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ , నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత, జాతీయ కన్జ్యూమర్ ఆఫ్ఫైర్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఎస్. ఎస్. ఠాకూర్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ శేఖర్ చతుర్వేది ఉన్నారు.. డీజీపీ కార్యాలయానికి వచ్చిన కేంద్ర బృందానికి స్వాగతం పలికారు డిజీపీ మహేందర్ రెడ్డి. కేంద్ర బృందంతో సమావేశంలో అడిషనల్ డీజీ లు జితేందర్, గోవింద్ సింగ్, ముగ్గురు కమిషనర్లు అంజనీ కుమార్, మహేష్ భగవత్, వీ. సీ. సజ్జనార్ ఐజీలు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కరోనా నియంత్రణ కై పోలీస్ శాఖ చేపట్టిన చర్యలను కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు పోలీస్ ఉన్నతాధికారులు. వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, రెవిన్యూ తదితర శాఖలతో సమన్వయం చేపట్టిన చర్యలను వివరించారు. వైద్య పరంగా ప్రధానంగా కిడ్నీ, డయాలసిస్, గర్భిణీలు, హృద్రోగ పేషెంట్ల కు అత్యవసర సమయాల్లో పోలీస్ శాఖ అందిస్తున్న సేవలను వివరించారు. ఈ చర్యలపై అధికారుల‌ను కేంద్ర బృందం‌ ప్రశంసించింది . ప్రజలకు నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచడంలో పోలీస్ శాఖ చేపట్టిన చర్యలను ప్రశంసించింది.