
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది.. చాప కింద నీరులా వ్యాపిస్తూ జనాల్లో మళ్ళీ లాక్ డౌన్ భయాన్ని పెంచుతోంది కరోనా. మంగళవారం ( జూన్ 10 ) నాటికి కరోనా కేసులు 7 వేలకు చేరినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 6 వేల 815కు చేరుకోగా గడిచిన 24 గంటల్లో 324 కొత్త కేసులు, 3 మరణాలు నమోదైనట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ. ఢిల్లీ, జార్ఖండ్, కేరళ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున మరణాలు నమోదైనట్లు వెల్లడించింది ఆరోగ్యశాఖ. కేరళలో వేగంగా వ్యాపిస్తోంది కరోనా. మంగళవారం నాటికి కేరళలో 2 వేల 53 యాక్టివ్ కేసులు నమోదయ్యాయని.. గడిచిన 24 గంటల్లో కేరళలో 96 కొత్త కేసులు నమోదైనట్లు తెలిపింది ఆరోగ్యశాఖ.
అధికారిక డేటా ప్రకారం గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాలు కేరళ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది, గత 24 గంటల్లో దేశ రాజధాని ఢిల్లీలో 37 కొత్త కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా మంగళవారం ఉదయం వరకు 783 మంది రోగులు కరోనా నుండి కోలుకున్నట్లు తెలుస్తోంది.
ఇక మహారాష్ట్రలో సోమవారం 65 కొత్త కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది మొత్తం కేసుల సంఖ్య వెయ్యి 504కి చేరుకున్నట్లు సమాచారం. ముంబైలో 22, పూణేలలో 29 కొత్త కేసులు నమోదయ్యాయి. జనవరి నుండి, 17,000 కి పైగా పరీక్షలు నిర్వహించగా... మొత్తం కేసుల్లో, 687 ముంబై నుండి వచ్చాయని.. మే నెలలోనే 681 కేసులు నమోదయ్యాయని తెలిపింది ఆరోగ్య శాఖ. ఈ ఏడాది మహారాష్ట్రలో 18 కరోనా మరణాలు నమోదైనట్లు తెలిపింది ఆరోగ్యశాఖ.
దేశవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదలకు JN.1, NB.1.8.1, LF.7, XFC వంటి కొత్త ఓమిక్రాన్ సబ్ వేరియంట్స్ కారణమని తెలిపింది ఆరోగ్యశాఖ. WHO ప్రస్తుతం వీటిని "పర్యవేక్షణలో ఉన్న వేరియంట్‌లు"గా వర్గీకరించింది. ఈ వేరియంట్ల వ్యాప్తి గురించి ఆందోళన అవసరం లేనప్పటికీ జాగ్రత్తగా ఉండాలని తెలిపింది WHO.