- సర్కార్ దవాఖాన్లలో వ్యాక్సినేషన్ సెంటర్లు
- యూనివర్సిటీలు, కాలేజీల్లోనూ క్యాంపులు
- అధికారులకు మంత్రి హరీశ్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖాన్లలో శుక్రవారం నుంచి కరోనా బూస్టర్ డోసు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. దవాఖాన్లతో పాటు అన్ని జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీల్లో వ్యాక్సినేషన్ క్యాంపులు పెట్టాలని అధికారులను గురువారం ఆయన ఆదేశించారు. సికింద్రాబాద్, నాంపల్లి, ఖాజీపేట రైల్వే స్టేషన్లు, జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లలో వ్యాక్సినేషన్ క్యాంపులను 24 గంటలూ అందుబాటులో ఉంచాలని సూచించారు. వంద కంటే ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకునే వారుంటే, వాళ్లు కోరుకున్న చోటుకే వెళ్లి వ్యాక్సిన్ వేయాలని ఆదేశించారు. ఇందుకోసం 040–24651119 నెంబర్‌లో సంప్రదించాలని ప్రజలకు మంత్రి సూచించారు. కాగా, 18 ఏండ్లు పైబడిన వారందరికీ ఉచితంగా బూస్టర్ డోసు వేయనున్నారు. సెకండ్ డోసుకు, బూస్టర్ డోసుకు మధ్య కనీసం 6 నెలల గ్యాప్ ఉంటేనే బూస్టర్ డోసు వేస్తారు. ఫస్ట్, సెకండ్ డోసు ఏ వ్యాక్సిన్ తీసుకుంటే అదే వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. శుక్రవారం నుంచి 75 రోజుల పాటు బూస్టర్ డోసు వ్యాక్సినేషన్ జరుగుతుంది.
2.3 కోట్ల మంది అర్హులు...
రాష్ట్రంలో 2 కోట్ల 86 లక్షల 81 వేల మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరిలో 2.3 కోట్ల మంది రెండో డోసు వ్యాక్సిన్ తీసుకొని 6 నెలలు అవుతోంది. వీళ్లందరూ బూస్టర్ డోసు వేసుకోవడానికి అర్హులే. ప్రస్తుతం రోజు సగటున 6 వేల మంది బూస్టర్ డోసు వేసుకుంటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసు తీసుకోవాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.
కేంద్ర నిర్ణయంపై మంత్రి హర్షం
18 ఏండ్లు నిండిన వాళ్లందరికీ ఉచితంగా బూస్టర్ డోసు వేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని పోయినేడాది నుంచి కేంద్ర సర్కార్‌ను మంత్రి హరీశ్‌రావు పలుమార్లు కోరారు. గతేడాది డిసెంబర్‌లో, ఈ ఏడాది జనవరి, ఏప్రిల్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి లేఖలు రాశారు. కేంద్ర మంత్రితో జరిగిన ప్రతి వీడియో కాన్ఫరెన్స్‌లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కేంద్రం బూస్టర్‌కు పర్మిషన్ ఇవ్వడంపై హరీశ్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర నిర్ణయంతో దేశంలోని ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొవిషీల్డ్, కొవ్యాగ్జిన్ డోసులు లక్షల సంఖ్యలో అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు.
