ఒమిక్రాన్‌‌పై అలర్ట్.. ఎయిర్‌‌‌‌పోర్టులో ఆర్టీపీసీఆర్ టెస్టులు

ఒమిక్రాన్‌‌పై అలర్ట్.. ఎయిర్‌‌‌‌పోర్టులో ఆర్టీపీసీఆర్ టెస్టులు

హైదరాబాద్, వెలుగు: కరోనా తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిందంటున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. ఇది ఎక్కువగా ఉన్నట్టు తేలిన దేశాల నుంచి మన రాష్ట్రానికి డైరెక్ట్ ఫ్లైట్లు లేకున్నా రాష్ట్ర ఆరోగ్యశాఖ అలర్ట్ అయింది. కేంద్రం సూచనల మేరకు ఎయిర్‌‌‌‌పోర్టులో స్ర్కీనింగ్‌‌ కట్టుదిట్టం చేశారు. ఇతర దేశాల నుంచి వచ్చేవాళ్లకు ఎయిర్‌‌‌‌పోర్టులోనే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. ఒమిక్రాన్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి ముంబయి, ఢిల్లీ వంటి సిటీలకు నేరుగా ఫ్లైట్లు వస్తున్నాయి. దాంతో అక్కడి ఎయిర్‌‌‌‌పోర్టుల్లో తీసుకుంటున్న చర్యలపై హెల్త్ సెక్రటరీ రిజ్వీ శనివారం ఆరా తీశారు. ఆ ఎయిర్‌‌‌‌పోర్టుల నుంచి హైదరాబాద్‌‌ వచ్చేవాళ్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై చర్చించారు. దీనిపై  సెంట్రల్ హెల్త్ మినిస్ర్టీ రీజినల్ ఆఫీసర్లు, ఎయిర్‌‌‌‌పోర్టు అథారిటీ ఆఫీసర్లు తదితరులతో మంత్రి హరీశ్‌‌రావు ఆదివారం రివ్యూ చేయనున్నారు. 

ఎయిర్‌‌‌‌పోర్టులో టెస్టులతో పాటు సమస్యాత్మక దేశాల నుంచి వచ్చేవాళ్ల శాంపిళ్ల జీనోమ్‌‌ సీక్వెన్సింగ్ చేయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు హెల్త్ ఆఫీసర్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల ఎయిర్‌‌‌‌పోర్టుల్లో దిగి రోడ్డు, రైలు రూట్లలో రాష్ట్రానికి వచ్చేవాళ్ల విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై ఆదివారం జరగనున్న రివ్యూలో చర్చించనున్నారు. ఫస్ట్ వేవ్‌‌ తరహాలో విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్యాసింజర్‌‌‌‌ వివరాలూ తమకివ్వాలని ఎయిర్‌‌‌‌పోర్ట్ అథారిటీని హెల్త్ డిపార్ట్‌‌మెంట్ కోరింది. పాస్‌‌పోర్టులో అడ్రస్ ప్రకారం, వారి ఇంటికే లోకల్ హెల్త్ స్టాఫ్‌‌ను పంపి టెస్టులు చేయించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

వ్యాక్సినేషన్‌‌ స్పీడప్​ చేయాలె

కొత్త వేరియంట్ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌‌ స్పీడ్ పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలు ఆసక్తి చూపకపోవడం వల్లే వ్యాక్సినేషన్‌‌ నెమ్మదించిందని ఆఫీసర్లు హరీశ్‌‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ అవసరాన్ని ప్రజలకు వివరించేందుకు సోమవారం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో 1.26 కోట్ల మంది రెండు డోసులు, 1.22 కోట్ల మంది సింగిల్ డోసు వ్యాక్సీన్ తీసుకున్నారు. 50 లక్షల మంది ఒక్క డోసూ తీసుకోకలేదు.