జూబ్లీహిల్స్ బాలిక కేసు.. 20 ఏళ్ల జైలుశిక్ష లేదా జీవితఖైదు

జూబ్లీహిల్స్ బాలిక కేసు.. 20 ఏళ్ల జైలుశిక్ష లేదా జీవితఖైదు

హైదరాబాద్ నగరంలో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో మొత్తం ఆరుగురిని అరెస్టు చేశామని, వీరిలో ఒక్కరే మేజర్ అని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. కేసులో ఐదుగురు మైనర్లు ఉన్నారు కాబట్టి.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పేర్లు వెల్లడించడం లేదన్నారు. వారందరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. అయితే ఆరో వ్యక్తి బాధితురాలిపై రేప్ చేయలేదన్నారు. రేప్ చేసిన వారికి 20 ఏళ్ల జైలు శిక్ష లేదంటే.. జీవిత ఖైదు విధించే అవకాశం ఉందన్నారు. కేసుకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. కేసుకు సంబంధించిన వివరాలను సీపీ ఆనంద్ మంగళవారం రాత్రి మీడియాకు వెల్లడించారు. ‘‘బెంగళూరులో ఉంటున్న ఓ మైనర్.. స్కూల్స్ స్టార్ట్ కాకముందు పార్టీ చేయాలని అనుకున్నాడు. ఇందుకోసం  హైదరాబాద్ లో ఉన్న ముగ్గురు స్నేహితులను సంప్రదించాడు. అనంతరం ఆ ముగ్గురు సర్వే చేసి.. అమ్నేషియా పబ్‌ బాగుంటుందని.. ఏప్రిల్ నెలలో సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. రూ. 1200 ఎంట్రీ పాస్ ఉంటే.. బేరం ఆడగా.. పబ్ వారు రూ. 900కు తగ్గించారు. మే 28వ తేదీన పార్టీ ఉంటుందని మరలా ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేశారు. తగ్గించిన ధర చెప్పకుండా రూ. 1200 డబ్బులు వసూలు చేశాడు. పబ్ కు రూ. లక్ష అడ్వాన్స్ చెల్లించారు. బాధితురాలు ఒక మైనర్..ఆమె కూడా రూ. 1300 ఇచ్చింది’’ అని సీపీ ఆనంద్ వివరించారు. 

మే 28న మధ్యాహ్నం పబ్‌‌లో పార్టీ..

‘‘ మే 28వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు మైనర్ పబ్ కు చేరుకుంది.  అక్కడ డ్యాన్స్ లు వేశారు. సాయంత్రం 3.15 గంటలకు ఓ మైనర్, సాదుద్దీన్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. 5.40కు బాధితురాలు.. ఆమె స్నేహితురాలు పబ్ బయటకు వచ్చారు. అక్కడే  నిందితులు ప్లాన్ చేసుకున్నట్లు అనుమానం కలిగింది. బాధితురాలితో ఉన్న అమ్మాయి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోయింది. నలుగురు మైనర్లు.. బాధితురాలు మెర్సిడేజ్ కారు ఎక్కగా.. మిగతా వారు వేరే కారులో బేకరీకి వెళ్లారు. బంజారాహిల్స్ కు చేరుకునే సమయంలో బలవంతంగా బాధితురాలితో అసభ్యకరంగా ప్రవర్తించారు. సాయంత్రం 5.54కు బాలిక మెర్సిడెజ్ నుంచి దిగి ఇన్నోవా కారు ఎక్కింది. 6.15కి ఆమె బయటకు వెళ్లింది. సాదుద్దీన్ తో పాటు ఐదుగురు ఇన్నోవాలో వెళ్లారు. 6.18 గంటలకు ఆరుగురిలో ఒకరు మరలా రిటర్న్ బేకరీకి వచ్చాడు. రోడ్ నెంబర్ 44 నిర్మానుష్య ప్రదేశంలో కారును ఆపి.. బాధితురాలిపై అత్యాచారం చేశారు. ఈ సమయంలోనే ఆమెకు గాయాలయ్యాయి. అనంతరం ఆమెను డ్రాప్ చేసి వెళ్లిపోయారు. రాత్రి 7.53కి తండ్రికి ఫోన్ చేయడంతో వచ్చి ఆమెను తీసుకెళ్లారు. మే 31న సాయంత్రం 8 గంటల వరకు ఘటన గురించి తల్లిదండ్రులకు బాలిక చెప్పలేదు’’ అని  సీపీ సీవీ ఆనంద్ వివరించారు. 

పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో..
 
తల్లిదండ్రులకు అనుమానం వచ్చి.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మే 31న జూబ్లీ హిల్స్ పీఎస్ లో కేసు నమోదు చేశారని  సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. వివరాలు చెప్పకపోవడంతో భరోసా సెంటర్ కు తరలించి.. బాలికను ప్రశ్నించడం జరిగిందన్నారు. కౌన్సెలింగ్ అనంతరం వివరాలు చెప్పడంతో కేసుల సెక్షన్ లను మార్చామన్నారు. మే 2వ తేదీన ఎవరెవరు ఉన్నారనే దానిపై దర్యాప్తు చేశామని, మే 3వ తేదీన రాత్రి 9 గంటలకు ఒక మేజర్ ను అరెస్టు చేసి రిమాండ్ చేశామన్నారు. తర్వాత.. ఇతరులను కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. ప్రతి సీసీటీవీ ఫుటేజీని క్షుణ్నంగా పరిశీలించినట్లు వెల్లడించారు. మొత్తం ఐదుగురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఆరుగురిలో ఒక్కరు మాత్రమే మేజర్ ఉన్నాడని.. మిగతా వారందరూ మైనర్లు ఉన్నారని తెలిపారు. మైనర్లు ఉండడం వల్ల వారి పేర్లు, ఇతరత్రా వివరాలు చెప్పడం లేదని సీపీ ఆనంద్ పేర్కొన్నారు.