ధర్నా చౌక్ లో ఆందోళనలు చేయొచ్చు: సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

ధర్నా చౌక్ లో ఆందోళనలు చేయొచ్చు: సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేందుకు ఒక వేదిక అవసరమని.. ధర్నా చౌక్ అందుకు ఉపయోగపడుతుందని అన్నారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.డిసెంబర్ 15వ తేదీ శుక్రవారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద  ధర్నా చౌక్‌ను యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.  ఈ క్రమంలో ధర్నా చౌక్, ఎన్టీఆర్ స్టేడియాన్ని  పోలీస్ అధికారులతో కలిసి సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  తాను సిపిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ధర్నా చౌక్ పరిసరాలు ఎలా ఉన్నాయని చూసేందుకు ఇక్కడికి వచ్చానన్నారు. గతంలో ధర్నా చౌక్ విషయంలో కోర్టులో కేసు వేశారని.. ఆ అంశంలో ప్రజాస్వామ్యబద్ధంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు.  ఇక్కడ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండేదని.. కొత్తగా నిర్మించిన స్టీల్ బిట్స్ కారణంగా ఆ సమస్య కొంత మేర తీరిందని చెప్పారాయన. ప్రజలు ఏదైనా నిరసన చేపట్టాలనుకుంటే ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇచ్చి.. అనుమతితో ధర్నాలు నిర్వహించుకోవచ్చని అన్నారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో  ప్రజలు శాంతియుతంగా నిరసనలు తెలుపవచ్చని చెప్పారు. ఇటీవల నగరంలో అక్కడక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నట్లు చూస్తున్నామని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు తరచుగా సెక్రటేరియట్ రావడం వల్ల కొంతమేర ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని.. వాటిని ఎప్పటికప్పుడు తమ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పరిష్కరిస్తుందని సీపీ తెలిపారు.