- ఇందిరా పార్కు వద్ద సీపీఐ నిరసన దీక్ష
హైదరాబాద్, వెలుగు: దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూల్చేసేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఉపా చట్టంతో దుర్మార్గమైన హింసాకాండను అమలు చేస్తుందని మండిపడ్డారు. ప్రజాస్వామిక వాధులంతా ఏకతాటిపైకి వచ్చి జాతీయ స్థాయిలో ఉపా చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ఉపా చట్టాన్ని రద్దు చేయాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో గురువారం ఇందిరా పార్కు వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి పౌరహక్కుల సంఘం నాయకులు ప్రొఫెసర్ హరగోపాల్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటి.నరసింహ, వీఎస్ బోస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, ఎ.రవీంద్రచారి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.." కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపా చట్టానికి మోదీ ప్రభుత్వం మరింత విషపు కోరలు పెంచింది. 90 శాతం వికలాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబాను దుర్మార్గంగా పదేళ్లు జైల్లో పెట్టింది" అని ఆవేదన వ్యక్తం చేశారు.