ఇందిరాపార్కు వద్ద సీపీఐ ధర్నా

ఇందిరాపార్కు వద్ద సీపీఐ ధర్నా

హైదరాబాద్, వెలుగు:  సర్కారు జాగల్లో  గుడిసెలు వేసుకున్న పేదలకు  జీవో58 ద్వారా  ఇండ్ల పట్టాలు ఇవ్వాలని  సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా డిమాండ్ చేశారు. గురువారం ఇందిరాపార్కు వద్ద  సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అజీజ్ పాషా మాట్లాడుతూ..  జీహెచ్ఎంసీ పరిధిలో అధికారికంగా 1,432 మురికివాడలతోపాటు అదనంగా మరో 450 ఉన్నాయని తెలిపారు.  మురికివాడల్లో సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ఆరోపించారు. 

ధర్మాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ..గడీలు, చీఫ్ సెక్రటరీలు, అధికారుల  కార్యాలయాలను బద్దలు కొట్టే రోజు వస్తుందన్నారు. ప్రజల బాధలను అర్థం చేసుకుని  సమస్యలను పరిష్కరించాలని కోరారు.  వందల, వేల  ఎకరాల్లో  ఫామ్ హౌస్​నిర్మించుకుంటారు..పేదలకు 90 గజాలు ఇవ్వరా? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యులు చాడ వెంకట్ రెడ్డి,  ఈటీ నర్సింహా, వీఎస్ బోస్,  పశ్య పద్మ, బాలమల్లేశ్, చాయాదేవి, జంగయ్య  పాల్గొన్నారు. 

ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ ఇయ్యాల, రేపు నిరసనలు

హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ ఈ నెల 7, 8 తేదీల్లో నిరసనలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఏపీ పునర్ విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేశారో ప్రధాని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తొమ్మిదేండ్లుగా హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు తెలిపారు. 

గురువారం ఆయన మగ్దుంభవన్​ లో మీడియాతో మాట్లాడారు. కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వనందుకు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో, బయ్యారం ఉక్కు కర్మాగారం చేపట్టనందుకు కొత్తగూడెంలో నిరసనలు చేపడతామని చెప్పారు.