నా భూమి సంగతి అంతేనా... చాడను వెంటాడుతున్న సమస్య

నా భూమి సంగతి అంతేనా... చాడను వెంటాడుతున్న సమస్య

భూమి సమస్య అనగానే ధరణి వెబ్ సైటే గుర్తొస్తది. అయితే అంతకంటే ముందు నుంచే చాలా భూ సమస్యలు ఉన్నా వాటికీ ధరణి పరిష్కారం చూపిస్తుందని కేసీఆర్ చాలా ఆశలుపెట్టారు. అట్లా నమ్ముకున్నవాళ్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. లక్షల్లో ఫిర్యాదుల మాట అట్లా ఉంచితే.. రాష్ట్రంలో ఓ సీనియర్ రాజకీయ లీడర్ నూ భూ సమస్య వెంటాడుతోంది. ఆయనే రాష్ట్ర సీపీఐ అగ్రనేత చాడ వెంకట్ రెడ్డి. పైకి చెప్పుకోలేకపోయినా ఆయన సన్నిహితులు మాత్రం దీనిపై గట్టిగానే ఫీలవుతున్నారు.

చాడ వెంకట్ రెడ్డి సొంతూరు సిద్దిపేట జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ. ఇక్కడ ఆయనకు భూములు ఉన్నాయి. కొన్నేండ్లుగా ఆయనతో పాటు మరికొందరు, రైతులు సహా మొత్తం 110 మంది భూవివాదం వల్ల ఇబ్బంది పడుతున్నారు. దీనిపై వీఆర్వో నుంచి కలెక్టర్ దాకా ఎంతమందికి చెప్పినా సమస్య తీరలేదు. చాడకు లీడర్ గానే కాదు కేసీఆర్ తోనూ మంచి రిలేషన్ ఉంది. కాబట్టి.. ఆయనే ఏదైనా చేయాలని ఊరివాళ్లు అడిగారు. చివరికి ధరణి వెబ్ సైట్ ను తీసుకొచ్చిన సమయంలో చాడ ఈ అంశాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. 

చాడ చెప్పడంతో రైతుల భూ సమస్యలు తీరుస్తామని కేసీఆర్ అసెంబ్లీలోనే హామీ ఇచ్చారు. దీంతో రెవెన్యూ సెక్రటరీ, కలెక్టర్, రెవెన్యూ యంత్రాంగం మొత్తం కదిలింది. గ్రామంలో భూములన్నీ సర్వే చేశారు. ఈ హడావుడి చూసి నిజంగానే పనవుతుందని ఊరివాళ్లంతా సంబురపడ్డారు. ఎంకన్న సమస్య తీరుస్తానని స్వయంగా కేసీఆర్ అసెంబ్లీలో చెప్పడంతో చాడతో పాటు ఊరివాళ్లంతా నమ్మారు. అప్పటివరకు కోర్టులో ఉన్న కేసులను కూడా రైతులు వాపస్ తీసుకున్నారు. ఇప్పటికీ అతీగతీ లేకపోవడంతో వారి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. 

రైతుల బాధ ఒకలా ఉంటే చాడ పరిస్థితి మరోలా ఉందని సన్నిహితులు చెబుతున్నారు. అప్పటికి ఆయన సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. తరచూ బైపోల్స్ వల్ల రాజకీయంగా కేసీఆర్ ను కలిసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆయన పదవిలో లేరు. కేసీఆర్ ను కలిసే అవకాశం లేదు. ఇటు ఆయన ఫోన్ చేస్తే రెవెన్యూ అధికారులు లిఫ్ట్ కూడా చేయట్లేదని చెబుతున్నారు. దీంతో ఆయన నలిగిపోతున్నారని తెలుస్తోంది. 

రాజకీయంగా ఎంత సపోర్ట్ చేసినా తన సొంత సమస్య, రైతుల సమస్య విషయంలో కేసీఆర్ తీరుపై చాడ గరం గరంగా ఉన్నారని చెబుతున్నారు. ఆయన బాధితుల లిస్టులో ఇప్పుడు చాడ కూడా చేరిపోయారని కొందరు సీపీఐ నేతలు కామెంట్ చేస్తున్నారు.