
హైదరాబాద్, వెలుగు: మన దేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనధికార ప్రధానిగా వ్యవహరిస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోదీ డమ్మీగా మారిపోయారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. దేశానికి టెర్రరిస్టులు, మావోయిస్టులు.. ఎవరు ప్రమాదకరమో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి మావోయిస్టులపై ఉన్న ద్వేషం, కసి టెర్రరిస్టులపై లేనట్లుందన్నారు.
కేంద్రం వెంటనే మావోయిస్టులతో చర్చలు జరపాలన్నారు. మంగళవారం మగ్దూం భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. అసలు దేశానికి మోదీ ప్రధానా? లేక ట్రంపా అని ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు. టెర్రరిస్టుల పేరిట మోదీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక, హైదరాబాద్ నగరమంతా ఇప్పడు అందాల భామల చుట్టూ తిరుగుతోందని, ఆ భామల వెనుక మంత్రులు తిరుగుతున్నారని నారాయణ ఎద్దేవా చేశారు.
మావోయిస్టులతో చర్చలు జరపాలి: కూనంనేని
ఆపరేషన్ కగార్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలని కూనంనేని సాంబశివరావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశంపై దాడిచేసి అమాయక ప్రజలను చంపిన టెర్రరిస్టులతో దౌత్యపరంగా చర్చలు జరుపుతామని ప్రకటించిన కేంద్రం.. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినా ఎందుకు ముందుకు రావట్లేదని ఆయన ప్రశ్నించారు.