హైదరాబాద్, వెలుగు: కేంద్రం విద్యార్థుల జీవి తాలతో చెలగాటమాడుతోందని, విద్యా వ్యవస్థను ప్రైవేటీకరించి కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టడం వల్లే పేపర్ లీకేజీ వంటి అక్రమాలు జరుగుతున్నాయని సీపీఐ జాతీయ నేత నారాయణ పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో జరిగిన అక్రమాలకు ప్రధానమంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు కోట్లాది రూపాయలు వెచ్చించి పేపర్లను లీక్ చేయిస్తున్నాయని, దీనివల్ల ప్రతిభ ఉన్న విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. మంగళవారం నారాయణ ఒక వీడియో సందేశంలో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
నీట్ ఎగ్జాం పేపర్ లీకేజీతో 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో కూరుకుపోయిందన్నారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలు, ఫలితాల రద్దుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మార్చేశారని అన్నారు. విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాయడం ఆపి, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా పారదర్శకమైన విద్యా వ్యవస్థను తీసుకురావాలని కోరారు.
