నాడు మెజార్టీ ఉన్నా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కోలేదా?: కూనంనేని

నాడు మెజార్టీ ఉన్నా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కోలేదా?: కూనంనేని

కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పూర్తిస్థాయి మెజార్టీ ఉన్నా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగేసుకోలేదా? అని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ‌‌‌‌కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ను బలహీనపరిచి పరోక్షంగా బీజేపీ బలోపేతానికి సహకరించాడని ఆరోపించారు. 

అదే కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ లో చేరుతుంటే గుండెలు బాదుకోవడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. కరీంనగర్ లో మంగళవారం ప్రారంభమైన ఏఐఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులకు చీఫ్ గెస్టుగా హాజరైన సాంబశివరావు విలేకరులతో మాట్లాడారు. 

 ప్రధాని మోదీ 400 సీట్లు కావాలని పిలుపునిస్తే..చావుతప్పి కన్ను‌‌‌‌ లొట్ట బోయినట్లుగా ప్రజలు 240 సీట్లు మాత్రమే ఇచ్చారని అన్నారు. రామాలయం నిర్మించినా అయోధ్య ఉన్న ఫైజాబాద్ లో బీజేపీ ఓడిపోయిందని తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ‌‌‌‌వల్లే ఈ రోజు కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం నడుస్తోందని, మోదీ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదని అన్నారు. తెలంగాణ ప్రజలపైన కిషన్ రెడ్డి, సంజయ్ కి ప్రేమ ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 

సింగరేణి మైన్లు ప్రైవేట్ కు అప్పగిస్తున్నరు..

సింగరేణిని ప్రైవేటీకరించబోమని గతంలో ప్రధాని మోదీ ప్రకటించారని కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా అదే చెప్తున్నారని , పైకి అలా చెప్తూనే సింగరేణి లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న అన్ని మైన్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు.  గతంలో టెన్త్ పేపర్ లీకేజీ విషయంలో ఎగిరెగిరి పడ్డ బండి సంజయ్.. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.‌‌‌‌ 

దీనికి బాధ్యత వహిస్తూ తక్షణమే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, ఏఐఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, సీపీఐ జిల్లా నాయకులు సురేందర్ రెడ్డి, సృజన్ కుమార్ పాల్గొన్నారు.