బ్రిడ్జిలు కూలినట్టే..బీఆర్ఎస్ సర్కార్ కూలుతది: నారాయణ

బ్రిడ్జిలు కూలినట్టే..బీఆర్ఎస్ సర్కార్ కూలుతది: నారాయణ

నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కట్టిన బ్రిడ్జిలు, డ్యామ్​లు కూలిపోతున్నట్టే.. బీఆర్ఎస్ సర్కార్ కూడా కూలిపోతదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తాను దేవున్ని నమ్మనని, కానీ.. మేడిగడ్డ, కేబుల్ బ్రిడ్జి రూపంలో ప్రభుత్వ పతనానికి ప్రకృతి ఇలా హింట్ ఇస్తున్నదని చెప్పారు. కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి నాణ్యతను గురువారం ఆయన చాడ వెంకట్​రెడ్డితో కలిసి పరిశీలించారు. 

తర్వాత నారాయణ మీడియాతో మాట్లాడారు. ‘‘కేబుల్ బ్రిడ్జి పనులు పైన పటారం.. లోన లొటారంలా ఉన్నాయి. కేసీఆర్, కేటీఆర్ తెల్ల జుట్టుకు నల్ల రంగు వేసుకున్నట్లు పరిస్థితి ఉంది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నాణ్యత పాటించకుండా హడావుడిగా పనులు కంప్లీట్ చేశారు. అడ్డగోలుగా దోచుకోవడానికే కేబుల్ బ్రిడ్జి నిర్మించారు. బ్రిడ్జి దగ్గర సెల్ఫీలు తీసుకుంటే.. అభివృద్ధి జరిగినట్టా? ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు?”అని ఆయన ప్రశ్నించారు. కేబుల్ బ్రిడ్జ్ దగ్గర నిర్మించిన చెక్ డ్యాంలు వరదలకి కొట్టుకుపోయాయన్నారు. నాణ్యతపై సిట్టింగ్ జడ్జితో విచారణ  జరిపించాలని డిమాండ్ చేశారు. 

విద్రోహక చర్య అనడం హాస్యాస్పదం

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగితే.. విద్రోహక చర్య అనడం హాస్యాస్పదమని నారాయణ అన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడం చూస్తుంటే.. ప్రభుత్వ వైఫల్యాలను పక్కన పెట్టేసి, తప్పంతా ఎవరిపైనో నెట్టే ప్రయత్నం జరుగుతున్నదని విమర్శించారు. భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజీని సీపీఐ లీడర్లతో కలిసి సందర్శించారు. తొందరపాటు నిర్ణయాలు, హడావుడిగా బ్యారేజీ కట్టడంతోనే కుంగిందన్నారు. ఇక్కడి అధికారులు, కేంద్ర బృందం చేసిన ప్రకటనలకు తేడా ఉందన్నారు. నాణ్యత లోపం లేదని, టెక్నికల్​ మిస్టేక్స్ ఉన్నాయని కేంద్ర బృందం చెప్పిందని వివరించారు. మేడిగడ్డ కేసీఆర్ స్పందించాలని డిమాండ్​ చేశారు.