రాజధాని మార్పుపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు

రాజధాని మార్పుపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు

రాజధానిని మార్చొద్దంటూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 19వ రోజు నిరసనలు జరుగుతున్నాయి. ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ, సీపీఐ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకుడు నారాయణ రాజధాని మార్పు విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల ప్రకటనతో హైదరాబాద్‌లో రియల్ వెంచర్లు పెరిగాయని సీపీఐ నాయకుడు నారాయణ అన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై టీఆర్ఎస్ నేతలు ఏపీ సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారని నారాయణ అన్నారు. వైసీపీకి దమ్ముంటే రాజధాని మార్పు అజెండాతో మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని ఆయన సవాల్ విసిరారు. సీఎం జగన్ సహా ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని ఆయన అన్నారు. సీఎం జగన్ తెలంగాణ కోసం సేవ చేస్తున్నారు తప్ప.. ఆంధ్రకోసం కాదని నారాయణ ఎద్దేవా చేశారు. రాజధానిని మార్చుతామని ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. జగన్ 30 ఏళ్ల సీఎంలా కాకుండా.. 3 ఏళ్ల సీఎం లాగా కనిపిస్తున్నారని ఆయన అన్నారు. రాజధాని మార్పు విషయంపై కమిటీలు ఇచ్చే నివేదికలు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని ఆయన అన్నారు. కమిటీలు ఖాళీ పేపర్లను అందజేస్తే.. వాటిలో విజయసాయి రెడ్డి తమకు అనుకూలంగా నివేదిక రాశాడని నారాయణ అన్నారు. ఉద్ధండ్రాయునిపాలెంలో రాజధాని కోసం మోడీ శంఖుస్థాపన చేసిన చోట స్థానిక మహిళలు సామూహిక పొంగళ్ల కార్యక్రమం నిర్వహించారు.