- సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపు
- పేదలకు అన్నం పెట్టే పథకానికి తూట్లు పొడుస్తున్నరు
- రాష్ట్రాలు 40 % వ్యయం భరించాలనడం అన్యాయం
- బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలి
- కార్పొరేట్ సంస్థలకు సానుకూలంగా వ్యవహరిస్తున్నదని ఫైర్
ఖమ్మం, వెలుగు: వామపక్షాల పోరాట ఫలితంగా సాధించుకున్న ఉపాధి హామీ పథకానికి బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థలకు బీజేపీ సానుకూలంగా వ్యవహరిస్తూ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నదని అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకునేందుకు ఐక్య ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మంలోని సప్తపది ఫంక్షన్ హాల్‌లో సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబ శివరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజా మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం వ్యయం భరించాలంటూ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తున్నదన్నారు. మతోన్మాద శక్తులను అడ్డుకునేందుకు కలిసి వచ్చే పార్టీలతో ముందుకెళ్లాలని సూచించారు. మోదీ సర్కారు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ 4 లేబర్ కోడ్‌లు తీసుకొచ్చిందని, దీనిని నిరసిస్తూ ఫిబ్రవరి 12న 10 జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు మద్దతుగా జాతీయ కౌన్సిల్‌లో తీర్మానం చేయనున్నట్లు తెలిపారు.
ఢిల్లీ కాలుష్యంపై కార్యాచరణ
ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందని, ఈ సమస్యపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని డి.రాజా ఆరోపించారు. నిపుణులతో చర్చించి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కాలుష్యం మీద కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన ఖమ్మం జిల్లా సమితితోపాటు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీపీఐ శాఖలను జాతీయ కార్యవర్గం అభినందించింది. త్వరలో ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు పలు అంశాలపై చర్చలు జరిపారు. కార్యవర్గంలో చర్చించిన నిర్ణయాలపై మంగళ, బుధవారాల్లో జరిగే జాతీయ కౌన్సిల్‌లో కార్యాచరణ ప్రకటించనున్నారు.
