దేశంలో ప్రశ్నార్థకంగా ఓటు హక్కు: సీపీఐ నేత డి. రాజా

దేశంలో  ప్రశ్నార్థకంగా ఓటు హక్కు: సీపీఐ నేత డి. రాజా
  • ఎన్నికల కమిషన్ రాజ్యాంగ సంస్థగా పని చేయడం లేదు
  • బీజేపీని గద్దె దింపేందుకు ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలి
  • ఉప రాష్ట్రపతి ఎన్నికలో జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి మద్దతు 
  • సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ.రాజా వెల్లడి 
  • మేడ్చల్ జిల్లాలో సీపీఐ రాష్ట్ర 4వ మహాసభలు ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: దేశంలో ఓటు హక్కు ప్రశ్నార్థకంగా మారిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ. రాజా ఆందోళన వ్యక్తం చేశారు. భారత ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థగా పని చేయడంలేదని ఆరోపించారు. రాజ్యాంగం, ఓటు హక్కు పరిరక్షించాలంటే బీజేపీని గద్దె దించాల్సిందేనని పేర్కొన్నారు. అందుకు లౌకిక, ప్రజాతంత్ర పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావాలని పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా గాజుల రామారంలోని ‘కామ్రేడ్ ఎన్.బాలమల్లేశ్  హాల్’లో సీపీఐ రాష్ట్ర 4వ మహాసభలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సభలు 3 రోజులు కొనసాగుతాయి. బుధవారం ముఖ్యఅతిథిగా రాజా, అతిథులుగా సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీ.రాజా మాట్లాడుతూ.. దేశం అత్యంత సంక్షిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్నదని, ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగంపై  దాడి పెరిగిందని ఆరోపించారు. అర్హులైన ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల కమిషన్ పై ఉందని, బిహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పేరుతో ఇష్టంవచ్చినట్టు ఓటర్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. 

సుదర్శన్ రెడ్డికి సీపీఐ సంపూర్ణ మద్దతు

ఉప రాష్ట్రపతి ధన్ ఖడ్​ రాజీనామాకు ఆయన అనారోగ్యం కారణం కాదని, అందుకు రాజకీయ కారణం ఉన్నదని రాజా పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి సీపీఐ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నదన్నారు. రాష్ట్రంలో సీపీఐ అత్యంత బలమైన పార్టీ అని, ప్రస్తుతం ఒక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. సీపీఐ సీనియర్ నాయకులు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కందిమళ్ల ప్రతాపరెడ్డి మాట్లాడుతూ.. వీర తెలంగాణ గడ్డపై మతోన్మాద బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునే శక్తి వామపక్ష పార్టీలకే ఉందన్నారు. సినీ నటుడు మాదాల రవి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో సాంస్కృతిక విప్లవం రావాల్సిన అవసరం ఉన్నదన్నారు.  మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ, సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి, కె.శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస రావు, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు.