హైదరాబాద్, వెలుగు: దేశంలో రాజ్యాంగాన్ని రూపుమాపేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. న్యాయ వ్యవస్థను సమీక్షిస్తామని ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్నారని.. దీని ద్వారా న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్ ను మార్చాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. దీని ఫలితంగా రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. పోరాడి సాధించుకున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో నారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగానికి ప్రమాదం వస్తే ఏమౌతుందో బంగ్లాదేశ్ లో చూశామన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ పాత్ర లేదని, కమ్యూనిస్టు పార్టీ పాల్గొని అనేక మంది పోరాటయోధులను కోల్పోయిందని చెప్పారు. అనంతరం సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 77 ఏండ్లు గడిచినా ఫలాలు ప్రజలకు అందలేదన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా.. ప్రజల బతుకులు మారడం లేదన్నారు. దేశంలో లౌకిక వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకులు పల్లా వెంకట రెడ్డి, పశ్య పద్మ, బొమ్మగాని ప్రభాకర్, అంజయ్య నాయక్, ఉజ్జిని యాదగిరిరావు, కలకొండ కాంతయ్య, పల్లె నరసింహ పాల్గొన్నారు.
