ప్రజా పాలన ఐదేండ్లు కొనసాగాలి ..జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ కే పార్టీ మద్దతు

ప్రజా పాలన ఐదేండ్లు కొనసాగాలి ..జూబ్లీహిల్స్ ఎన్నికల్లో  కాంగ్రెస్ కే పార్టీ మద్దతు
  • సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్​రెడ్డి 

భీమదేవరపల్లి, వెలుగు: ప్రజా పాలన పేరుతో సంక్షేమ పథకాలు అందిస్తున్న కాంగ్రెస్​ఐదేండ్లు అధికారంలో ఉండాలని  సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్​రెడ్డి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్​కు తమ మద్దతు ఇస్తున్నామన్నారు. వర్షాలకు దెబ్బతిన్న దేవాదుల ప్రధాన, ఉప కాల్వలకు మరమ్మతు చేపట్టి చివరి ఆయకట్టు రైతులకు నీరందించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 

శుక్రవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లిలో రైతు సంఘం జిల్లా వర్కింగ్​ ప్రెసిడెంట్​కొంగల రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మొంథా తుపాను ప్రభావంతో జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ప్రధానంగా భీమదేవరపల్లి మండలంలో తీవ్ర ప్రాణనష్టం, పశు సంపద, పంట, ఆస్తి నష్టం జరిగాయని, పూర్తిస్థాయిలో అంచనా వేసి బాధితులకు పరిహారం చెల్లించాలన్నారు.  వరద ప్రభావంతో దెబ్బతిన్న దేవాదుల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. 

కొత్తపల్లిలో వరదలతో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా కాకుండా రూ. 25 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని, పశు సంపద నష్టపోయిన బాధితులకు కూడా పరిహారం ఇవ్వాలన్నారు. స్థానిక ఎన్నికలు సత్వరమే జరిగేలా చూడాలని, లేదంటే పరిపాలన దెబ్బతింటుందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు అదరి శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి, జిల్లా నేతలు ఉట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్, ఎన్ఏ స్టాలిన్, మండల కార్యదర్శి అదరి రమేశ్, నేతలు చిలుక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.