కేసీఆర్​ది  అవకాశవాదం.. అభ్యర్థుల ప్రకటన ఏకపక్షం

కేసీఆర్​ది  అవకాశవాదం.. అభ్యర్థుల ప్రకటన ఏకపక్షం
  • సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని, కూనంనేని ఫైర్​
  • కేసీఆర్​ పాలనలో నియంతృత్వం ఉన్నా.. బీజేపీని వ్యతిరేకిస్తున్నరనే మద్దతిచ్చినట్లు వెల్లడి
  • సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేస్తాయని ప్రకటన

హైదరాబాద్, వెలుగు:  సీఎం కేసీఆర్​ది అవకాశవాదమని, స్నేహధర్మాన్ని పాటించలేదని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. ‘‘ఒకవైపు అసెంబ్లీలోనే కాదు, ఢిల్లీ స్థాయిలో కలిసి పని చేద్దామని చెప్తూనే, సీట్ల సర్దుబాటులో చర్చలు జరుగుతున్న టైమ్​లోనే ఏకపక్షంగా బీఆర్​ఎస్​ అభ్యర్థుల జాబితాను కేసీఆర్​ ప్రకటించడమేంది?” అని ప్రశ్నించారు.

బీజేపీతో బీఆర్​ఎస్​కు ఎక్కడో సఖ్యత వచ్చినట్లు అర్థమవుతున్నదని వారు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేస్తాయని, కలిసొచ్చే వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక పార్టీలతో ముందుకు పోతామని చెప్పారు. హైదరాబాద్ మగ్దూంభవన్​లో మంగళవారం సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సమావేశమమయ్యారు. అసెంబ్లీ అభ్యర్థులను కేసీఆర్​ ప్రకటించడంపై వారు చర్చించారు. అనంతరం.. తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడారు.

బీఆర్ఎస్ సర్కార్​ను ఓడించుడే: కూనంనేని 

బీఆర్ఎస్  ప్రభుత్వాన్ని ఓడించడమనే నినాదంతో ఎన్నికల్లో ముందుకెళ్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఏకపక్షంగా బీఆర్​ఎస్​ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో ఆ పార్టీకి 4 నుంచి 5 శాతం ఓట్లు తగ్గనున్నాయని అన్నారు. ‘‘కేసీఆర్ ప్రవర్తించిన తీరు అభ్యంతరకరం. కనీసం మిత్రధర్మాన్ని, స్నేహాన్ని పాటించలేదు. పొమ్మనకుండా పొగ పెట్టినట్టుగా వ్యవహరించారు” అని మండిపడ్డారు.

అప్పట్లో బీజేపీ నెపంతో సీపీఎం, సీపీఐని కేసీఆర్​ ఆహ్వానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ ప్రమాదం ఉందా.. లేదా..? బీజేపీతో బీఆర్​ఎస్​కు బంధం ఏర్పడిందా? దీనిపై కేసీఆర్ సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు. రాజకీయాలంటేనే మోసం అన్నట్లు కేసీఆర్​ నిర్వచనం ఇచ్చారని దుయ్యబట్టారు. ‘‘వామపక్షాలు వెంట లేకపోతే మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్​ఎస్​ పరిస్థితి మిటి? బీజేపీ గెలిచేది కాదా?’’ అని ప్రశ్నించారు.  

ఊహించని పరిణామం: తమ్మినేని 

కేసీఆర్ ఏకపక్షంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించారని, తాము కోరిన స్థానాల్లో కూడా బీఆర్​ఎస్​ అభ్యర్థులను ప్రకటించడం ఊహించని పరిణామమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మునుగోడు ఎన్నికలప్పుడు మద్దతు ఇవ్వాలని  కేసీఆరే స్వయంగా కోరారని, కానీ ఇప్పుడు ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు. ‘‘పొత్తుల అంశంలో సీట్ల సర్దుబాటు సమస్య కాదు.. రాజకీయ వైఖరిలోనే ఏదైనా తేడా వచ్చినట్లుంది’’ అని ఆయన అన్నారు.

సీట్ల సర్దుబాటు సందర్భంగా సీపీఎం, సీపీఐ, బీఆర్ఎస్ మధ్య జరిగిన చర్చల్లో రాజకీయ వైఖరిపైనా డిస్కషన్​ జరిగింది. ఇండియా, ఎన్డీఏ కూటములకు మేము దూరంగా ఉంటామని, మీరు ఇండియా కూటమిలో ఉన్నారని మమ్మల్ని బీఆర్​ఎస్​వాళ్లు అన్నరు. ఆ తర్వాత మేం పోటీ చేసే సీట్ల వివరాలు ఇచ్చినం. ఇప్పుడు ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించారు” అని పేర్కొన్నారు. ‘‘తొమ్మిదేండ్ల కేసీఆర్​ పాలనలో అప్రజాస్వామిక విధానాలు, కుటుంబ పాలన, నియంతృత్వం,  ధర్నాచౌక్ రద్దు వంటి లోపాలున్నా  కేవలం బీజేపీని వ్యతిరేకించారనే బీఆర్​ఎస్​ను మేం సమర్థించినం” అని తమ్మినేని అన్నారు.

కాంగ్రెస్​తో కలిసే చాన్స్​!

అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని సీపీఎం, సీపీఐ నిర్ణయం తీసుకున్నాయి. దీంట్లో చేరో 15 స్థానాల్లో పోటీకి రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం సీపీఎం భద్రాచలం, పాలేరు, మిర్యాలగూడ, మధిర, ఇబ్రహీంపట్నం తదితర స్థానాల్లో పోటీకి సిద్ధమైంది. సీపీఐ కొత్తగూడెం, మునుగోడు, బెల్లంపల్లి, హుస్నాబాద్ తదితర స్థానాల్లో పోటీకి సై అంటున్నది. బీఆర్​ఎస్ పార్టీ లెఫ్ట్ నేతలతో చర్చలు చేస్తూనే.. సీపీఎం, సీపీఐ నేతలు అడుగుతున్న స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించడంపై ఆ రెండు పార్టీల నేతలు మండిపడుతున్నారు.

కాగా, బుధవారం సీపీఐ రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. ఈ నెల 27న సీపీఎం రాష్ట్ర కమిటీ మీటింగ్ ఉంది.  రాష్ట్రంలో కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసే అంశంపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఇండియా’ కూటమిలో లెఫ్ట్ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి.