కాంగ్రెస్​తో సీపీఎం కటీఫ్.. 17 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటన

కాంగ్రెస్​తో సీపీఎం కటీఫ్.. 17 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటన
  • సీపీఐ ఓకే అంటే కలిసి బరిలోకి దిగుతామని వెల్లడి
  • మమ్మల్ని కాంగ్రెస్ అవమానించింది: తమ్మినేని   
  • బీజేపీని ఓడించేందుకు అవసరమైన చోట
  • బీఆర్ఎస్, కాంగ్రెస్​కు మద్దతు ఇస్తామని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ తో పొత్తు లేదని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని సీపీఎం ప్రకటించింది. ఒకవేళ సీపీఐ ఓకే అంటే, ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తామని వెల్లడించింది. మొత్తం 24 స్థానాల్లో పోటీ చేయాలని ప్రతిపాదనలు రాగా, 17 సీట్లపై స్పష్టత వచ్చిందని చెప్పింది. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని, వాటి లిస్టు విడుదల చేసింది. మరో మూడు, నాలుగు నియోజకవర్గాల్లో పోటీపై కసరత్తు చేస్తున్నట్టు పేర్కొంది.

గురువారం ఎంబీ భవన్​లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడారు. కమ్యూనిస్టులను అవమానించేలా కాంగ్రెస్ వైఖరి ఉందని, అందుకే పొత్తులకు దూరంగా ఉంటున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్క సీటు కూడా గెల్వకుండా చూస్తామని అన్నారు. ‘‘బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాలు ఏవో అంచనా వేస్తున్నాం. బీజేపీని ఓడించేందుకు అవసరమైతే బీఆర్‌‌ఎస్‌‌, కాంగ్రెస్‌‌కు మద్దతు ఇస్తాం. బీజేపీని ఓడించడమే మా లక్ష్యం” అని చెప్పారు. కమ్యూనిస్టుల్లేని శాసన సభ, దేవుడు లేని దేవాలయం లాంటిదని.. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.

మాతో కలిసి రాకున్నా సీపీఐకి మద్దతు ఇస్తం..

పొత్తు కోసం కాంగ్రెస్​ నేతలే ముందుగా తమను సంప్రదించారని తమ్మినేని చెప్పారు. ‘‘మేం ఐదు సీట్లు ఇవ్వాలని అడిగాం. చివరికి మిర్యాలగూడ, వైరా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు వైరా ఇవ్వలేమని చెబుతున్నారు. హైదరాబాద్​లో ఓ సీటు ఇస్తామంటున్నారు. భద్రాచలం నియోజకవర్గంలో 10 సార్లు ఎన్నికలు జరిగితే, 8 సార్లు సీపీఎం గెలిచింది. కానీ అది కాంగ్రెస్ సిట్టింగ్ సీటు అని, వదులుకునేందుకు ఒప్పుకున్నాం. అదే త్రిపురలో పొత్తులో భాగంగా మా పార్టీ సిట్టింగ్ సీట్లనూ కాంగ్రెస్​కు ఇచ్చాం. కాంగ్రెస్ పొత్తు ధర్మాన్ని పాటించడం లేదు. ఇంత అవమానకరంగా పొత్తులు అవసరం లేదు” అని తెలిపారు. దీనంతటికీ కాంగ్రెస్ పార్టీదే బాధ్యత అని అన్నారు. కలిసి పోటీ చేసే అంశంపై సీపీఐతో చర్చించామని, శుక్రవారం తమ నిర్ణయం చెబుతామని ఆ పార్టీ తెలిపిందని పేర్కొన్నారు. ఒకవేళ కాంగ్రెస్ తో కలిసే సీపీఐ పోటీ చేస్తే... సీపీఐపై అభ్యర్థిని నిలబెట్టబోమని, ఆ పార్టీకి మద్దతిస్తామని ప్రకటించారు.

పోటీ చేసే 17 స్థానాలివీ..

రాష్ట్ర కమిటీలో 24 స్థానాల్లో పోటీ చేయాలని ప్రతిపాదనలు వచ్చాయని తమ్మినేని తెలిపారు. ముందుగా 17 స్థానాలు ప్రకటిస్తున్నామని చెప్పారు.  ‘‘పాలేరు, మధిర, వైరా, ఖమ్మం, సత్తుపల్లి, భద్రాచలం, అశ్వారావుపేట, మిర్యాలగూడ, నల్గొండ, నకిరేకల్, భువనగిరి, హుజూర్ నగర్, కోదాడ, జనగామ, ఇబ్రహీంపట్నం, పటాన్ చెరు, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం. మా పార్టీకి బలమైన కేంద్రాలుగా ఉన్న ఖమ్మం జిల్లాలో 5, భద్రాద్రిలో 2, నల్గొండలో 3, సూర్యాపేటలో 2, యాదాద్రి, జనగామ, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఒక్కో సీటు ఉన్నాయి” అని చెప్పారు.