- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఫైర్
హైదరాబాద్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో దైవదర్శనానికి వెళ్లిన రెండేళ్ల దళిత చిన్నారి అనుమానాస్పద మృతి అత్యంత విషాదకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కుమ్మెర కొండపై ఉన్న ఆలయాన్ని కొందరు పెత్తందారులు తమ గుప్పిట్లో పెట్టుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతూ భక్తులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
చిన్నారి మృతికి కారణమైన వారిపై తల్లి కీర్తి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. బాధితుల ఫిర్యాదును పక్కనపెట్టి, దాడి చేసిన పెత్తందారులు ఇచ్చిన ఫిర్యాదుకే పోలీసులు ప్రాధాన్యమిచ్చారని, ఇది వారి కుల వివక్షకు నిదర్శనమని ధ్వజమెత్తారు.
ప్రజాసంఘాల ఆందోళన తర్వాతే కేసు నమోదు చేయడం సిగ్గుచేటన్నారు. బాధితుల ఫిర్యాదును నిర్లక్ష్యం చేసిన ఎస్‌ఐ, ఇతర సిబ్బందిపై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్నారి మృతికి కారకులైన దోషులను అరెస్టు చేసి, వారిపై హత్య కేసులు నమోదు చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని, దాడి చేసిన వారి నుంచి బాధితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
