ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులతో 5న ఛలో హైదరాబాద్ ..సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

ట్రిపుల్ ఆర్  భూ నిర్వాసితులతో 5న ఛలో హైదరాబాద్ ..సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

హైదరాబాద్, వెలుగు: ట్రిపుల్ ఆర్​భూ నిర్వాసితులు, రైతులతో కలిసి వచ్చేనెల 5వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. రిజినల్​రింగ్​రోడ్డు (ఆర్​ఆర్​ఆర్)​ కోసం ఎనిమిది జిల్లాలు 33 మండలాల్లోని 163 గ్రామాల రైతులు భూములు కోల్పోతున్నారని.. ఈ నెల 26 వరకు ప్రభావిత గ్రామాల్లో పర్యటిస్తామని.. 27న 8 జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెస్లీ చెప్పారు. 

అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్​లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ట్రిపుల్​ఆర్​కు ఎంత భూమి కావాలి.. ఏ అలైన్​మెంట్​అమలు చేస్తారో సీఎం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

  గాజుల రామారంలో పేదల గుడిసెలను హైడ్రా కూల్చివేయడాన్ని జాన్ వెస్లీ ఖండించారు. అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల పేరుతో ప్రజల ఆస్తులను వారి ఆమోదం లేకుండా లాక్కోవడం అన్యాయమని అన్నారు.