- హెచ్‌ఎండీఏ కమిషనర్‌ను కలిసిన సీపీఎం ప్రతినిధి బృందం
హైదరాబాద్ సిటీ, వెలుగు: ట్రిపుల్ఆర్ భూ నిర్వాసితుల సమస్యలపై శుక్రవారం సీపీఎం రాష్ట్ర నాయకులు హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ను కలిశారు. ట్రిపుల్ఆర్భూ సేకరణ అలైన్మెంట్ మార్చడం వల్ల రైతులు గందరగోళ పడుతున్నారని, ఉత్తరం భాగంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భూసేకరణ చేసిందని కమిషనర్ కు వివరించారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. ఇప్పటికీ స్థానిక రైతులతో అధికారులు చర్చించలేదని, గ్రామసభలు జరిపి రైతులతో మాట్లాడలేదని, నష్టపరిహారం నిర్ణయించలేదన్నారు.
రైతుల ఆమోదం లేకుండానే భూమిని తీసుకోవడం పూర్తయిందని ప్రకటించడం సమంజసం కాదన్నారు. దక్షిణ ప్రాంతంలో ప్రస్తుతం ప్రకటించిన అలైన్మెంట్ చేర్పులు, మార్పులతో అస్పష్టంగా వున్నప్పటికీ, అలైన్‌మెంట్‌లో ఏమార్పులూ చేయలేదని కమిషనర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కొంతమంది పెత్తందార్ల కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం అలైన్మెంట్లు మార్చుతూ పేద రైతుల భూములు లాక్కునే చర్యను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
సీపీఎం లీడర్లు తమ దృష్టికి తెచ్చిన అంశాలను అంశాలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని కమిషనర్ తెలిపినట్టు వివరించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతో పాటు, నేతలు జహంగీర్, సారంపల్లి మల్లారెడ్డి, నరసింహారావు, పగడాల యాదయ్య ఉన్నారు.
