- యూరియా కోసం రైతుల పడిగాపులు
- సెక్రటరీ పై ఆగ్రహం
వర్ని,వెలుగు: యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు సెక్రటరీకి పట్టడం లేదని సొసైటీ సిబ్బందికి సంబంధించిన వాళ్ళకు మాత్రమే యూరియా సరఫరా చేస్తున్నారని రుద్రూర్ సొసైటీ వద్ద ఆదివారం రైతులు ఆందోళన చేశారు. ఉదయాన్నే పలువురు రైతులు సొసైటీకి చేరుకొని సెక్రటరీ,సిబ్బంది పై మండిపడ్డారు. రుద్రూర్ సొసైటీ పరిధిలో యూరియా పంపిణీ చేయడంలో సహకార సంఘం సిబ్బంది కొందరు రైతులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి పంపిణీ చేస్తున్నారని మిగతా రైతులకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శనివారం మధ్యాహ్నం యూరియా వస్తే ఆదివారం పండుగ రోజు సైట్ ఓపెన్ చేసి కొందరికి పంపిణీ చేసే ప్రయత్నం చేశారని రైతులు కార్యదర్శి గంగారాంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడా రైతులకు సొసైటీ సిబ్బంది కొమ్ము కాస్తున్నారని సొసైటీకి యూరియా రాగానే ముందస్తుగా వారికి సమాచారం అందించి ఆన్లైన్లో బుక్‌చేసి వారికి యూరియా అందించి మిగతా రైతులకు ఇవ్వడం లేదని అన్నారు.
యూరియా స్టాకు అయిపోయిందని తర్వాత మళ్ళీ యూరియా లోడ్ రాగానే ఇస్తామంటు సెక్రటరీ తప్పించుకుంటున్నారని రైతులు వాపోయారు. రైతుల పట్ల వివక్ష చూపుతున్న సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ సాయన్న ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని రైతులతో మాట్లాడి వారిని శాంతింపజేశారు. మండల వ్యవసాయ అధికారి వచ్చి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
