- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
- దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా భారీ నిరసన
బషీర్బాగ్, వెలుగు: కార్మికుల హక్కులను, చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా.. వామపక్ష పార్టీ నాయకులు నారాయణగూడ ఫ్లై ఓవర్ కింద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ.. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నదని విమర్శించారు. కార్మిక వ్యతిరేక వైఖరి మార్చుకోవాలని సూచించారు.
లేనిపక్షంలో ప్రజా ఉద్యమంలో వామపక్ష పార్టీలు భాగస్వామ్యమై కేంద్ర ప్రభుత్వ మెడలు వంచుతామని హెచ్చరించారు. అనంతరం సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టంచేశారు. ఈ సమ్మెలో దాదాపు 30 కోట్ల మంది భాగస్వామ్యమైయ్యరని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనన్నారు.
సీపీఐ (ఎంఎల్ న్యూ డెమోక్రసీ) అధికార ప్రతినిధి చలపతి రావు మాట్లాడుతూ.. కార్మికుల హక్కులను పరిరక్షించాల్సిన కార్మిక శాఖను ప్రభుత్వాలు పూర్తిగా నిర్వీర్యం చేస్తూన్నాయన్నారు. సీపీఐ (ఎంఎల్ మాస్లైన్ ) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి హమ్మేశ్ మాట్లాడుతూ.. దేశ ప్రజల హక్కులను కాలరాస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతోందన్నారు.
