కేంద్రంలో బీజేపీని ఓడించడమే మా లక్ష్యం : బీవీ రాఘవులు

కేంద్రంలో బీజేపీని ఓడించడమే మా లక్ష్యం : బీవీ రాఘవులు

హైదరాబాద్ :  రాబోయే ఎన్నికల్లో బీజేపీ (కేంద్రంలో) ని ఓడించడమే తమ లక్ష్యమన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. బీజేపీని ఓడించడం కోసం వివిధ రాష్ర్టాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలతో కలిసి పని చేస్తామని చెప్పారు. తాము చేసే పోరాటాలకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తేనే ఆ పార్టీతో కలసి పని చేస్తామని స్పష్టం చేశారు. ఈసారి తెలంగాణలో15 నుండి 20 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. దోమలగూడలోని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ (TSUTF) కార్యాలయంలో యూనిఫాం సివిల్ కోడ్, మణిపూర్ పరిణామాలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, TS UTF రాష్ట్ర అధ్యక్షులు జంగయ్యతో పాటు పలువురు వక్తలు పాల్గొన్నారు. 

మునుగోడు ఉప ఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్ కు తమకు గ్యాప్ పెరిగిందని రకరకాల వార్తలు వస్తున్నాయని చెప్పారు బీవీ రాఘవులు. తాము అపాయింట్ మెంట్ కోసం, అధికారాల కోసం ఎన్నడూ పని చేయమన్నారు. తమ సిద్ధాంతాల కోసమే మాత్రమే పని చేస్తామన్నారు. ఎన్నికల పొత్తులు, సీట్ల కేటాయింపుపై ఇంకా చర్చలు జరగలేదన్నారు. యూనిఫాం సివిల్ కోడ్, మణిపూర్ వివాదాలపై కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు మానుకోవాలన్నారు. ఎన్నికల కోసం యూనిఫాం సివిల్ కోడ్ ను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకువస్తోందన్నారు. మణిపూర్లో మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు.