
హైదరాబాద్, వెలుగు: ఇజ్రాయిల్ దాష్టీకాలను ఖండిస్తూ పాలస్తీనాకు సంఫీుభావంగా హైదరాబాద్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో అక్టోబర్ 7న భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పేర్కొన్నారు. ఈ ర్యాలీలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొననున్నాయని చెప్పారు.
మంగళవారం (సెప్టెంబర్ 30) హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అధ్యక్షతన వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. పాలస్తీనాకు సంఫీుభావం తెలిపే కార్యక్రమంతోపాటు ఇండియాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌లకు నిరసనపై చర్చించారు.
త్వరలో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని నాయకులు ప్రకటించారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్ హత్యాకాండను కొనసాగిస్తున్నదని, గాజా భూభాగంపై బాంబులు కురిపిస్తూనే ఉన్నదని పేర్కొన్నారు.