
హైదరాబాద్, వెలుగు: వానాకాలం సీజన్ ప్రారంభమై 2నెలలు గడుస్తున్నా.. రైతులకు యూరియాను అందించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మండిపడ్డారు. యూరియా కోసం రైతులు రోడ్లపైకి వస్తున్నా.. బీజేపీ నాయకులు కుంటిసాకులు చెబుతూ, కృత్రిమ కొరత సృష్టించారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి కావాల్సిన యూరియాను తెప్పించడానికి బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి 9.8 లక్షల టన్నుల యూరియా కావాల్సి ఉండగా.. 1.5 లక్షల టన్నులు కేంద్రం తగ్గించిందని, ఈ కోటాను కూడా ఇంతవరకు సకాలంలో సరఫరా చేయకపోవడంతో యూరియా కొరత ఏర్పడిందన్నారు.