మార్చి 24న ఢిల్లీలో మహా ధర్నా : ఎంఏ బేబీ

మార్చి 24న ఢిల్లీలో మహా ధర్నా : ఎంఏ బేబీ
  •     అమెరికాతో వాణిజ్య ఒప్పందం దేశానికే ప్రమాదం: ఎంఏ బేబీ
  •     ఉపాధి హామీని కేంద్రం నిర్వీర్యం చేస్తున్నదని ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని మోదీ సర్కారు అనుసరిస్తున్న  ప్రజా, కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి 24న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో మహా ధర్నా నిర్వహించనున్నట్టు సీపీఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ప్రకటించారు. ఈ ధర్నాలో దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొననున్నట్టు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం (ఎంబీ భవన్)లో పార్టీ నేతలు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికాతో మోదీ ప్రభుత్వం కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశ సమగ్రతకే ముప్పు అని హెచ్చరించారు. 

దీని ప్రభావం కేవలం వ్యవసాయంపైనే కాకుండా, దేశ జీడీపీపైన, అన్ని రంగాలపైనా పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇండియా ఏ దేశం నుంచి చమురు కొనాలనేది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయిస్తారా? ఆయన చెబితేనే మనం వినాలా? అదే నిజమైతే మన దేశానికి ప్రధాని మోదీ, చమురు శాఖ మంత్రి ఎందుకు?’ అని ఆయన  ప్రశ్నించారు. గ్రామీణ పేదలకు అండగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందని బేబీ విమర్శించారు. 

100 రోజుల పనిని 125 రోజులకు పెంచుతామనడం పచ్చి మోసమన్నారు. 125 రోజుల పని కల్పించాలంటే రూ.3 లక్షల కోట్లు అవసరమని.. కానీ, బడ్జెట్‌లో నామమాత్రపు నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు.  అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే ప్రజల పక్షాన పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.