- లేబర్ కోడ్‌లతో ఉద్యోగ భద్రత కరువు: బీవీ రాఘవులు
హైదరాబాద్, వెలుగు: ‘జీ రామ్జీ’ చట్టం రాష్ట్రాలకు పెనుభారంగా మారబోతున్నదని, ఆర్థిక ఇబ్బందులతో రాష్ట్రాలు 40 శాతం నిధులను ఖర్చుచేయకపోతే కేంద్రం ఇచ్చే 60 శాతం నిధులను ఆపేస్తుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఆ చట్టం ద్వారా దేశంలోనే ఎక్కువ పని దినాలను వాడుకుంటున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతాయని తెలిపారు. గ్రామీణ భూస్వాములు, పట్టణాల్లోని కార్పొరేట్ల సంస్థలకు కారుచౌకగా కూలీలు దొరికేలా ఈ చట్టం ఉందని, గిరిజనులు, ఆదివాసీలు, దళితులు ఎక్కువ నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జ్యోతితో కలిసి రాఘవులు మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాల్లో దేశానికే అత్యంత ప్రమాదకరమైన నాలుగు చట్టాలకు మోదీ సర్కారు ఆమోద ముద్ర వేసుకున్నదన్నారు.
వాటికి వ్యతిరేకంగా కలిసొచ్చే పార్టీలన్నింటిని కలుపుకుని దేశవ్యాప్త పోరాటాలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. నాలుగు లేబర్ కోడ్‌లతో కార్మికులు సమ్మెహక్కును కోల్పోతారని, ఉద్యోగ భద్రత ఉండదని, కనీస వేతనాల కోసం కార్మికులు బేరసారాలు ఆడే హక్కును కోల్పోతారన్నారు.
