భారీ వర్షాలకు గోదావరి బ్రిడ్జికి పగుళ్లు

 భారీ వర్షాలకు గోదావరి బ్రిడ్జికి పగుళ్లు
  • రంగంలోకి దిగి వెంటనే బ్రిడ్జి పగుళ్లు సరిచేసిన ఆర్ అండ్ బి అధికారులు

నిర్మల్ జిల్లా: భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో అనేక చోట్ల రోడ్లు ధ్వంసం కాగా.. తాజాగా బాసరలోని గోదావరిపై నిర్మించిన వంతెనకు పగుళ్లు ఏర్పడింది. గోదావరి బ్రిడ్జి ఇనుప రాడ్లు బయటకి వచ్చాయి. బ్రిడ్జి ప్రమాదకరంగా మారిందన్న వార్తలు రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. 
గోదావరి బ్రిడ్జికి ఏర్పడిన పగుళ్లను స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆర్ అండ్ బీ అధికారులు స్పందించారు. పోలీసులు రంగంలోకి దిగి ఎలాంటి ప్రమాదం జరగకుండా వాహనాలను నియంత్రించగా.. ఆర్ అండ్ బి అధికారులు తమ సిబ్బందితో వచ్చి బ్రిడ్జి పై వచ్చిన గ్యాప్ ను సరిచేశారు. బ్రిడ్జి ప్రమాదకరంగా మారిన విషయంపై అధికారులు సకాలంలో స్పందించి మరమ్మత్తులు పూర్తి చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.