ఈ రోజుల్లో క్రెడిట్ కార్డుల వాడకం విపరీతంగా పెరిగింది. షాపింగ్ మాల్స్‌లో స్వైప్ చేయడానికో, ఆన్‌లైన్ పేమెంట్స్ కో వీటిని ఎక్కువగా వాడుతుంటారు. అయితే చాలా మంది అత్యవసర సమయాల్లో డబ్బులు అవసరం అయినప్పుడు ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. అదేంటంటే.. క్రెడిట్ కార్డును నేరుగా ఏటీఎం మిషన్‌లో పెట్టి క్యాష్ విత్‌డ్రా చేయడం. తెలియక చేసే ఈ చిన్న తప్పు మిమ్మల్ని కోలుకోలేని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తుంది తెలుసా.
సాధారణంగా క్రెడిట్ కార్డుతో షాపింగ్ చేసినప్పుడు బ్యాంకులు 45 నుండి 50 రోజుల వరకు ఎలాంటి వడ్డీ లేని కాలపరిమితిని అందిస్తాయి. కానీ ఏటీఎం నుండి నగదు విత్‌డ్రా చేసిన మరుక్షణమే ఈ గ్రేస్ పీరియడ్ సదుపాయం పూర్తిగా రద్దవుతుంది. అంటే మీరు డబ్బులు డ్రా చేసిన మొదటి రోజు నుంచే బ్యాంకులు వడ్డీని లెక్కించడం ప్రారంభిస్తాయి.
క్రెడిట్ కార్డ్ క్యాష్ విత్‌డ్రా పై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు, సాధారణ పర్సనల్ లోన్స్ కంటే ఊహించని స్థాయిలో చాలా ఎక్కువగా ఉంటాయి. బ్యాంకులు వార్షికంగా కనీసం 33% నుంచి 45% వరకు అత్యధిక వడ్డీని.. అది కూడా చక్రవడ్డీ రూపంలో వసూలు చేస్తాయి. దీనికి తోడు ప్రతి విత్‌డ్రాపై కనీసం రూ.250 నుండి రూ.500 వరకు లేదంటే విత్‌డ్రా చేసిన మొత్తంలో 2.5% నుండి 3% వరకు ఫీజు కట్ అవుతుంది. పైగా ఈ సేవలన్నింటిపై అదనంగా 18% GST కూడా పడుతుంది.
కేవలం కొన్ని వేల రూపాయల అత్యవసరం కోసం క్రెడిట్ కార్డుపై ఆధారపడి ఏటీఎంలో చెయ్యి పెడితే.. వచ్చే నెలలో బిల్లు చూసేసరికి గుండె ఆగినంత పని అవుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. జేబు ఖాళీగా ఉందని చేసే ఈ పని, మిమ్మల్ని అప్పుల ఊబిలోకి లాగుతుందని మర్చిపోకండి. అందుకే ప్రాణాపాయ స్థితిలో మరే ఇతర మార్గం లేని అత్యంత అనివార్యమైన పరిస్థితుల్లో తప్ప.. క్రెడిట్ కార్డు ద్వారా ఏటీఎంల నుంచి డబ్బులు తీసే జోలికి అస్సలు వెళ్లకూడదని ఆర్థిక నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. క్రెడిట్ కార్డ్ అనేది డిజిటల్ లావాదేవీలకే కానీ.. డబ్బులు డ్రా చేసుకుని వాడుకోవటానికి మాత్రం కాదని గుర్తుంచోవాలని సూచిస్తున్నారు.
