ప్రమాదాల నివారణతో పాటు రహదారుల సేఫ్టీని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ(MoRTH) వాహనాల్లో వెహికల్ టూ వెహికల్ (Vehicle-to-Vehicle – V2V) కమ్యూనికేషన్ వ్యవస్థను దశలవారీగా తప్పనిసరి చేయాలని ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి కేంద్ర మోటార్ వాహనాల నియమాలు-1989లో సవరణలు చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే భవిష్యత్తులో దేశంలో రోడ్డు ప్రమాదాలను భారీగా తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
తాజా ప్రతిపాదన ప్రకారం 2028 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత తయారయ్యే ఎల్ (L), ఎం (M), ఎన్ (N) కేటగిరీలకు చెందిన అన్ని వాహనాల్లో V2V కమ్యూనికేషన్ వ్యవస్థను తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇప్పటికే ఈ సాంకేతికతతో ఉన్న వాహనాలు 2027 అక్టోబర్ 1 నుంచి సంబంధిత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఈ విధంగా దశలవారీ అమలుకు అవకాశం కల్పించడం ద్వారా వాహన తయారీ సంస్థలు, విడిభాగాల తయారీదారులు, సాంకేతిక సంస్థలు, ఇతర భాగస్వాములు కొత్త నిబంధనలకు అనుగుణంగా సన్నద్ధమయ్యే సమయం లభిస్తుందని కేంద్రం తెలిపింది.
ప్రయాణ సమయంలో రోడ్లపై నడుస్తున్న వాహనాల మధ్య సమాచార మార్పిడికి అవసరమైన 5.875 గిగాహెర్ట్జ్ నుంచి 5.925 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను టెలికమ్యూనికేషన్స్ శాఖ ఇప్పటికే కేటాయించింది. ఈ ఫ్రీక్వెన్సీని V2Vతో పాటు ఇతర ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్‌ల కోసం ఉపయోగించనున్నారు. ఈ సాంకేతికత ద్వారా సమీపంలోని వాహనాలు తమ వేగం, ప్రస్తుత స్థానం, ప్రయాణిస్తున్న దిశ, స్పీడ్ పెంచటం తగ్గించటం వంటి కీలక సమాచారాన్ని పరస్పరం రియల్‌టైమ్‌లో షేర్ చేసుకోగలవు.
ALSO READ : LIC షేర్లు ఎందుకు కుప్పకూలాయి
ఈ సమాచారంతో డ్రైవర్లు, వాహనంలోని భద్రతా వ్యవస్థలు ప్రమాదకర పరిస్థితులను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది. ముందు వెళుతున్న వాహనం సడెన్ బ్రేక్ వేయడం, ఢీకొనే ప్రమాదం, అన్ సేఫ్ లేన్ మార్పులు, అత్యవసర సేవల వాహనాలు సమీపించడం వంటి సందర్భాల్లో ముందస్తు హెచ్చరికలు అందుతాయి ఈ కొత్త టెక్నాలజీ వల్ల. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ADAS వ్యవస్థలు ప్రధానంగా కెమెరాలు, సెన్సార్లపై ఆధారపడుతుండగా, V2V వాటికి అదనపు సమాచారాన్ని అందించి ప్రత్యక్షంగా కనిపించని ప్రమాదాలను కూడా ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది. దీంతో రహదారులపై భద్రత మరింత మెరుగుపడటంతో పాటు, కనెక్టెడ్ మొబిలిటీ, భవిష్యత్ ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థల అభివృద్ధికి కూడా ఈ సాంకేతికత కీలకంగా మారనుంది.
