నో కాస్ట్ ఈఎంఐ, జీరో డౌన్ పేమెంట్ ..ఇకపై ఆఫర్లుండవ్

నో కాస్ట్ ఈఎంఐ, జీరో డౌన్ పేమెంట్ ..ఇకపై ఆఫర్లుండవ్

న్యూఢిల్లీ స్మార్ట్ ఫోన్, వాషింగ్ మెషిన్, టీవీ, ఏసీ ఇలా ఏది కొనాలన్నా.. మొదటగా కస్టమర్ నో కాస్ట్ ఈఎంఐ ఏమన్నా ఉందా… జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్లను కంపెనీ ఇస్తోందా? అని చూస్తుంటారు . కానీ ఇక నుంచి ఆ ఆశలు వదులుకోవాల్సిందేనట. కరోనా దెబ్బకు కన్జూమర్ ఫైనాన్స్ కంపెనీలు కూడా వాటి రూల్స్‌‌ను మార్చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జ్‌‌లు, ఏసీలు, వాషింగ్‌‌ మెషిన్లపై ఇచ్చే జీరో డౌన్ పేమెంట్ స్కీమ్‌‌లకు, నో కాస్ట్ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌‌స్టాల్‌‌మెంట్(ఈఎంఐ) ప్లాన్లకు స్వస్తి చెప్పబోతున్నాయి. కరోనా వైరస్ అవుట్‌‌బ్రేక్‌‌తో ఎకానమీ బాగా దెబ్బతింది. వేతనాలు తగ్గిపోయాయి. చాలా మందికి ఉద్యోగాలు కూడా పోయాయి. దీంతో క్రెడిట్ రిస్క్ పెరిగే అవకాశం ఉందని కన్జూమర్ ఫైనాన్స్ కంపెనీలు తమ రూల్స్‌‌ను టైట్‌‌ చేస్తున్నాయి. లాక్‌‌డౌన్ కారణంతో ఇప్పటికే డిమాండ్ పడిపోయింది. కానీ నిబంధనలను ఇంకా కఠినం చేస్తుండటంతో, లాక్‌‌డౌన్‌‌ సడలించాక కూడా సేల్స్ మరింత తగ్గే ప్రమాదం ఉందని రిటైలర్స్ భావిస్తున్నారు.

మాన్యుఫాక్చరర్స్ కూడా తక్కువ మార్జిన్ ఇచ్చే ప్రొడక్ట్‌‌లకు లాంగ్ టెన్యూర్ స్కీమ్‌‌లను నిరాకరిస్తున్నారని ఈ విషయం తెలిసిన ఓ వ్యక్తి చెప్పారు. బజాజ్ ఫైనాన్స్, హెచ్‌‌డీబీ ఫైనాన్సియల్ సర్వీసెస్ లాంటి పెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు(ఎన్‌‌బీఎఫ్‌‌సీలు) కొన్ని ఈఎంఐలను ముందుగానే  పేమెంట్ (డౌన్‌‌ పేమెంట్‌‌) చేయాలని కన్జూమర్లను అడుగుతున్నట్టు సీనియర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌‌లు చెప్పారు. ఏప్రిల్ నెలలో డిఫాల్ట్‌‌లు విపరీతంగా పెరిగిపోవడమే దీనికి ప్రధాన కారణమని అన్నారు. లోన్ టెన్యూర్లకు కూడా తొలుత చెల్లించే పేమెంట్లు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. అయితే హై మార్జిన్, ప్రీమియం ప్రొడక్ట్‌‌లకు మాత్రం కంపెనీలు నో కాస్ట్ ఈఎంఐలను ఆఫర్ చేస్తుండవచ్చని ఎగ్జిక్యూటివ్‌‌లు పేర్కొన్నారు. ఈ స్కీమ్‌‌ల టెన్యూర్ అంతకముందు 15–18 నెలలుంటే.. ఇప్పుడు 3–12 నెలల మధ్యలో ఉండవచ్చని చెప్పారు. ‘అన్ని లీడింగ్ కన్జూమర్ ఫైనాన్స్ కంపెనీలు వారి స్కీమ్‌‌లను  తిరిగి పరిశీలిస్తున్నాయి. లాక్‌‌డౌన్ కాలంలో కస్టమర్ల నుంచి ఈఎంఐల కలెక్షన్లలో ఇబ్బందులను ఎదుర్కొన్న తర్వాత, ఈ నిర్ణయం తీసుకున్నాయి’ అని  కన్జూమర్ ఎలక్ట్రాన్సిక్స్ అండ్ అప్లయెన్సస్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, గోద్రెజ్‌‌ అప్లయెన్సెస్‌‌ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. బ్రాండ్ల విషయానికొస్తే రెవెన్యూలు బాగా పడిపోయాయని, ఇవి ఖర్చును తగ్గించుకోవాలనుకుంటున్నాయని పేర్కొన్నారు. ఫైనాన్స్ కంపెనీలు వాటి కాస్ట్‌‌ను తగ్గించుకోనంత వరకు ప్రొడక్ట్‌‌ల ఇంటరెస్ట్ (వడ్డీ) కాంపోనెంట్‌‌ను తాము పొందలేమని బ్రాండ్లు చెబుతున్నాయి.

ఇవన్నీ తాత్కాలికమే..

డౌన్‌‌ పేమెంట్ ఆఫర్లు కస్టమర్ల ఫైనాన్స్ హెల్త్‌‌పై పాజిటివ్ అవుట్‌‌లుక్‌‌ను తెస్తాయని, ఈఎంఐ మొత్తం తగ్గుతుందని, నెలవారీ బడ్జెట్‌‌పై ఒత్తిడి ఉండదని హోమ్ క్రెడిట్ ఇండియా చీఫ్ మార్కెటింగ్, కస్టమర్ ఎక్స్‌‌పీరియెన్స్ ఆఫీసర్ మార్కో కేర్విక్ అన్నారు. రూల్స్‌‌ మార్చుతుండటంతో, ఆఫర్లు తగ్గే అవకాశం ఉందని సోనీ ఇండియా ఎండీ సునిల్ నాయర్ అన్నారు. కానీ ఇవన్నీ తాత్కాలిక చర్యలేనని, క్యాష్ ఫ్లో మెరుగుపడ్డ తర్వాత, మరికొన్ని నెలల్లో ఈ స్కీమ్‌‌లన్ని మళ్లీ అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. లో కాస్ట్, నో కాస్ట్ ఈఎంఐలు తమ బిజినెస్ మోడల్స్‌‌లో భాగమని వన్‌‌ప్లస్ కంట్రీ హెడ్ వికాస్ అగర్వాల్ అన్నారు. కొత్తగా లాంచ్ అయిన ప్రొడక్ట్‌‌లకు మంచి ఆఫర్లుంటాయని, పాత వాటికి ఈ ఆఫర్లు వేరుగా ఉంటాయని చెప్పారు. అయితే కన్జూమర్ ఫైనాన్స్ కంపెనీలు రూల్స్ ను కఠినతరం చేస్తుండటంపై రిటైలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈఎంఐ స్కీమ్‌‌లు తగ్గిపోవడం సేల్స్‌‌పై ప్రభావం చూపుతుందని లీడింగ్ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చెయిన్ గ్రేట్ ఈస్టర్న్‌‌ రిటైల్ డైరెక్టర్ పుల్కిట్ బెయిద్‌‌ అన్నారు. క్రెడిట్ కార్డులపై ఉన్న ఈఎంఐ స్కీమ్‌‌లను వెతుక్కుని, కస్టమర్లు కొనుగోళ్లు చేయనున్నారని, అంతేకాక వీరిలో చాలామంది కార్డు కస్టమర్లు మారటోరియం తీసుకుంటారని చెప్పారు. ఆర్‌‌‌‌బీఐ మూడు నెలల మారటోరియం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.  అయితే కన్జూమర్లకు, రిటైలర్లకు షాకిస్తూ.. నో కాస్ట్ ఈఎంఐలను, జీరో డౌన్‌‌ పేమెంట్లను కన్జూమర్ ఫైనాన్స్ కంపెనీలు తీసేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రభావం సేల్స్‌‌పై ఉంటుందన్నారు. ఈ విషయంపై స్పందించిన పీఎన్‌‌బీ, ఇండియన్ బ్యాంక్‌‌లు తమ పాలసీల్లో ఎలాంటి మార్పులు లేవని పేర్కొన్నాయి. ఈ విషయంపై బజాజ్ ఫైనాన్స్ కామెంట్ చేయడానికి నిరాకరించింది. ఐడీఎఫ్‌‌సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్‌‌డీబీ ఫైనాన్సియల్ సర్వీసెస్‌‌లు ఇంకా స్పందించలేదు.

కరోనా దెబ్బ.. మారుతీ లాభం తగ్గింది