క్రెడిట్స్ కూడా తగ్గింపు.. ఓయూలో కొత్త రూల్స్ .. ఈ ఏడాది నుంచే అమల్లోకి

క్రెడిట్స్ కూడా తగ్గింపు.. ఓయూలో కొత్త రూల్స్ .. ఈ ఏడాది నుంచే అమల్లోకి

ఓయూ, వెలుగు: ఈ అకడమిక్ ఇయర్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇకపై పీజీ కోర్సుల్లో ప్రతి సెమిస్టర్ కు నాలుగు పేపర్లే ఉండనున్నాయి. క్రెడిట్స్ ను కూడా తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం పీజీ కోర్సుల్లో 96 క్రెడిట్స్ ఉండగా, ఈ ఏడాది నుంచి వాటిని 80కి తగ్గించనున్నారు. ఈ విధానాన్ని కొంతమంది డీన్లు, ప్రొఫెసర్లు, స్టూడెంట్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ అమలు చేయాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు. దీనివల్ల స్టూడెంట్లకు తీవ్ర నష్టం జరుగుతుందని ప్రొఫెసర్లు చెబుతున్నా... ఈ విధానం దేశంలోని మెజార్టీ సెంట్రల్ యూనివర్సిటీల్లో అమలవుతోందని, యూజీసీ నిబంధనల మేరకే ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించామని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. 

‘‘నేషనల్ ఎడ్యుకేషన్​పాలసీ ప్రకారం పీజీ కోర్సుల్లో క్రెడిట్స్80కి తగ్గకుండా  ఉండాలి. అంతేగానీ 80 మాత్రమే ఉండాలనే రూల్స్ ఎక్కడా లేవు. ఈ విధానాన్ని దేశంలోని కొన్ని సెంట్రల్​ యూనివర్సిటీలు మాత్రమే అమలు చేస్తున్నాయి. స్టేట్​ యూనివర్సిటీల్లో ఎక్కడా లేదు. పీజీ  కోర్సుల్లో క్రెడిట్స్ ఎంత ఎక్కువుంటే విదేశీ యూనివర్సిటీలలో అంత ప్రాధాన్యం ఉంటుంది. తక్కువ క్రెడిట్స్ తో సర్టిఫికెట్లు పొందిన స్టూడెంట్లు అమెరికా, బ్రిటన్, కెనడా లాంటి దేశాల్లో అడ్మిషన్లు పొందలేరు” అని సీనియర్ ప్రొఫెసర్లు అంటున్నారు.