వార్నర్ మోచేతికి గాయం..చివరి రెండు టెస్టులకు దూరం

వార్నర్ మోచేతికి గాయం..చివరి రెండు టెస్టులకు దూరం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుస పరాజయాలతో ఇంటా బయటా విమర్శలెదుర్కొంటున్న  ఆస్ట్రేలియాను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా వెళ్లగా...గాయంతో స్టార్ పేసర్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అయితే తాజాగా డేవిడ్ వార్నర్ సైతం సిరీస్ నుంచి తప్పుకున్నాడు.  రెండో టెస్ట్‌లో మోచేతి గాయం బారిన పడిన డేవిడ్ వార్నర్‌.. మూడు, నాలుగు టెస్ట్‌లకు అందుబాటులో ఉండటం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. 

ఢిల్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో  సిరాజ్ వేసిన బౌన్సర్.. డేవిడ్ వార్నర్ మోచేతికి తాకింది. ఫిజియో పర్యవేక్షణ తర్వాత కొద్దిసేపు బ్యాటింగ్ చేసిన వార్నర్ షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. గాయం కారణంగా అతడు  రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కి రాలేదు. వార్నర్ స్థానంలో కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా మ్యాట్ రెంషాని టీమ్‌లోకి వచ్చాడు.  రెండో ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖవాజాతో కలిసి ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ చేశాడు. 

గాయం వల్ల మిగతా రెండు టెస్టులకు దూరమైన వార్నర్..వన్డే సిరీస్ వరకైనా కోలుకుంటాడా? లేదా? అనేది అనుమానంగా మారింది.  అయితే టెస్టు సిరీస్‌కి దూరమైన  వార్నర్ వన్డే సిరీస్‌లో ఆడతాడని క్రికెట్ ఆస్ట్రేలియా ఆశాభావం వ్యక్తం చేస్తోంది.