నేడు ఇంగ్లండ్‌‌‌‌‌‌తో ఇండియా మూడో వన్డే

 నేడు ఇంగ్లండ్‌‌‌‌‌‌తో ఇండియా మూడో వన్డే
  • జోరు మీద బౌలర్లు
  • కోహ్లీ, ధవన్‌‌‌‌పై అందరి దృష్టి
  • మ. 3.30 నుంచి సోనీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లో

టీ20 సిరీస్‌‌ గెలిచి వచ్చిన ఉత్సాహంలో  తొలి మ్యాచ్‌‌లో అద్భుత విజయం. రెండో పోరుకు వచ్చేసరికి దిమ్మతిరిగే ఓటమి. రెండింటిలోనూ బౌలర్లు సూపర్‌‌ పెర్ఫామెన్స్‌‌ చేశారు. కానీ,  బ్యాటర్లే ముంచారు..! అయినప్పటికీ ఇంగ్లండ్‌‌ గడ్డపై వరుసగా రెండు సిరీస్‌‌లు గెలిచే అవకాశం ఊరిస్తుండగా.. నేడు జరిగే మూడో వన్డేలో ఇంగ్లండ్‌‌తో టీమిండియా అమీతుమీకి రెడీ అయింది. సిరీస్‌‌ విన్నర్‌‌ను తేల్చే ఈ ఫైనల్‌‌ ఫైట్‌‌లో గెలిచి ఈ టూర్‌‌ను సక్సెస్‌‌ఫుల్‌‌గా ముగించాలంటే బ్యాటర్లు పుంజుకోవాల్సిందే..!   సెంచరీ అందుకోలేక వెయ్యి రోజులకు చేరువవుతున్న విరాట్‌‌ కోహ్లీ ఈ పోరుతో 
అయినా ఫామ్‌‌లోకి వస్తాడేమో చూడాలి!

మాంచెస్టర్‌‌: ఇంగ్లండ్‌‌ టూర్‌‌లో టీమిండియా ఆఖరాటకు సిద్ధమైంది. బ్యాటింగ్‌‌ వైఫల్యంతో లార్డ్స్‌‌లో ఘోర ఓటమి ఎదుర్కొన్న టీమిండియా  ఆదివారం జరిగే చివరి, మూడో మ్యాచ్‌‌లో ఆతిథ్య జట్టుతో పోటీ పడనుంది. గత పరాజయాన్ని మర్చిపోయి సరికొత్త ఆట చూపెట్టాలని రోహిత్‌‌సేన భావిస్తోంది. టీ20 సిరీస్‌‌లో చాలా దూకుడుగా బ్యాటింగ్‌‌ చేసిన ఇండియా సక్సెస్‌‌ సాధించింది. కానీ, వన్డేలకు వచ్చే సరికి డీలా పడింది. లార్డ్స్‌‌ పోరులో 247 పరుగుల సాధారణ టార్గెట్‌‌ను కూడా ఛేజ్‌‌ చేయలేక  వంద రన్స్‌‌ తేడాతో చిత్తవడం జట్టు కాన్ఫిడెన్స్‌‌ను దెబ్బతీసింది. ఆ పోరులో కెప్టెన్‌‌ రోహిత్‌‌, ధవన్.. హోమ్‌‌టీమ్‌‌ పేసర్లు టాప్లీ, విల్లీ స్వింగ్‌‌, స్వీమ్‌‌ను ఎదుర్కోవడంలో అతి జాగ్రత్త పడ్డారు. విరాట్‌‌ కోహ్లీ మరోసారి ఫెయిలైనప్పటికీ.. సీనియర్‌‌  ఓపెనర్లు తొలి రెండు ఓవర్లలో ఒక్క పరుగూ చేయకపోవడం సరైన విధానం కాదు. కాబట్టి ప్లేయర్ల మైండ్‌‌సెట్‌‌, బ్యాటింగ్‌‌ అప్రోచ్‌‌ తక్షణం మార్చాల్సిందే. ఆటగాళ్లు తమ కోసం కాకుండా జట్టుకు అవసరాలకు తగ్గట్టు ఆడాలని కెప్టెన్​ రోహిత్‌‌ రెండో మ్యాచ్‌‌కు ముందు చెప్పాడు.

టీ20ల్లో ఇలానే ఆడిన జట్టు ముందంజ వేసింది. షార్ట్‌‌ ఫార్మాట్‌‌కు కొనసాగింపు అయిన వన్డేల్లోనూ అదే దూకుడు కొనసాగిస్తే ఫలితం రాబట్టొచ్చు. ఒకటి రెండుసార్లు తప్పిస్తే రోహిత్‌‌ శర్మ బ్యాటింగ్‌‌ ఎప్పుడూ దూకుడుగానే ఉంటుంది. కానీ, 2023 వన్డే వరల్డ్‌‌కప్‌‌లో ప్లేస్‌‌ ఉండాలని ఆశిస్తే మాత్రం ధవన్‌‌ మునుపటి జోరు చూపెట్టాల్సిన అవసరం ఉంది. ఇక, ఈ మ్యాచ్‌‌లోనూ అందరి ఫోకస్‌‌ కోహ్లీపైనే ఉండనుంది. విండీస్‌‌ టూర్‌‌కు దూరంగా ఉంటున్న కోహ్లీ ఫామ్ అందుకునేందుకు ఇదే చివరి చాన్స్‌‌గా కనిపిస్తోంది. గత మ్యాచ్‌‌లో కుదురుకున్న తర్వాత ఔటైన విరాట్‌‌.. ఆఫ్‌‌ స్టంప్‌‌కు దూరంగా వెళ్లే బాల్స్‌‌ను వెంటాడే బలహీనతను సరిదిద్దుకుంటే మంచిది. సెంచరీ లేకున్నా కనీసం జట్టు విజయానికి అవసరమైన ఇన్నింగ్స్‌‌ ఆడితే అతని ఫ్యాన్స్‌‌ ఖుషీ అవుతారు.

మిడిలార్డర్‌‌లో సూర్యకుమార్‌‌, హార్దిక్‌‌ బాగానే ఆడుతున్నారు. గత పోరులో డకౌటైన పంత్‌‌ పుంజుకుంటే జట్టుకు తిరుగుండదు. బౌలింగ్‌‌ విషయానికి వస్తే స్పిన్‌‌ ఆల్‌‌రౌండర్ రవీంద్ర జడేజా గత ఐదు వైట్ బాల్స్‌‌ గేమ్స్‌‌లో నాలుగింటిలో బాగానే పెర్ఫామ్‌‌ చేశాడు. పేసర్‌‌ బుమ్రా ఫుల్‌‌ ఫామ్‌‌లో ఉండగా.. షమీ నుంచి అతనికి మంచి సపోర్ట్‌‌ లభిస్తోంది. తన టెక్నిక్‌‌ను మార్చుకున్న స్పిన్నర్‌‌ చహల్‌‌ కూడా రాణిస్తున్నాడు. మంచి బౌన్స్‌‌ రాబట్టే సామర్థ్యం ఉన్న ప్రసిధ్‌‌ కృష్ణ ఇంకాస్త మెరుగవ్వాలి. అతని ప్లేస్‌‌లో బ్యాటింగ్‌‌ కూడా చేయగలిగే శార్దూల్‌‌ను ఈ మ్యాచ్‌‌కు తీసుకునే చాన్సుంది. ఇక, హార్దిక్‌‌ బౌలింగ్‌‌లో రాణిస్తుండటం జట్టుకు ప్లస్‌‌ పాయింట్‌‌. గత రెండు మ్యాచ్‌‌ల్లో జోరును బౌలర్లు కొనసాగించి.. బ్యాటర్లూ మెప్పిస్తే ఇండియా  సిరీస్‌‌ గెలిచే అవకాశాలు పుష్కలం. 

ఇంగ్లండ్‌‌దీ అదే తీరు

ఈ మధ్య భారీ స్కోర్లతో చెలరేగిపోతున్న ఇంగ్లండ్‌‌ తొలి రెండు మ్యాచ్‌‌ల్లో బ్యాటింగ్‌‌లో తడబడింది. ఆ టీమ్‌‌ హార్డ్‌‌ హిట్టర్లంతా ఇండియా బౌలర్ల ముందు తేలిపోయారని చెప్పొచ్చు. కానీ, తొలి మ్యాచ్‌‌తో పోలిస్తే రెండో పోరులో  బ్యాటింగ్‌‌లో కాస్త మెరుగైన ఇంగ్లిష్‌‌ టీమ్‌‌.. బౌలింగ్‌‌లో చెలరేగింది. యువ పేసర్‌‌ రీస్‌‌ టాప్లీ అద్భుత బౌలింగ్‌‌తో లభించిన ఘన విజయం హోమ్‌‌ టీమ్‌‌లో కాన్ఫిడెన్స్‌‌ను కచ్చితంగా పెంచుతుంది. డేవిడ్‌‌ విల్లీ బ్యాట్‌‌, బాల్‌‌తో రాణించడం ఆ టీమ్‌‌కు ప్లస్‌‌ పాయింట్‌‌. ఇండియా మాదిరిగా  ఈపోరులో ఇంగ్లండ్‌‌కు  బ్యాటర్లే కీలకం కానున్నారు. వాళ్లు పుంజుకుంటేనే టీ20 సిరీస్‌‌ ఓటమికి ఇండియాపై హోమ్‌‌ టీమ్‌‌ రివెంజ్‌‌ తీర్చుకోగలదు. 

పిచ్‌‌/వాతావరణం

ఓల్డ్‌‌ ట్రాఫోర్డ్‌‌ వికెట్‌‌ బ్యాటింగ్‌‌కు అనుకూలం. ఇక్కడ జరిగిన గత తొమ్మిది వన్డేల్లో ఆరుసార్లు 290 ప్లస్‌‌ స్కోర్లు నమోదయ్యాయి. 9 మ్యాచ్​ల్లో తొలుత బ్యాటింగ్‌‌ చేసిన జట్లే ఎనిమిది సార్లు గెలిచాయి.  కానీ, ఉదయం బాల్‌‌ ఎక్కువగా మూవ్‌‌ అవుతుంది కాబట్టి  బ్యాటింగ్‌‌ కాస్త కష్టంగానే ఉంటుంది. ఈ స్టేడియంలో జరిగిన  2019 వన్డే వరల్డ్‌‌ కప్‌‌ సెమీస్‌‌లో  ఇండియా ఓడిపోయింది. ఇక, ఇంగ్లండ్‌‌లో ప్రస్తుతం విపరీతమైన ఎండ కాస్తోంది. గరిష్టంగా 30 డిగ్రీల వేడి ఉంటుంది కాబట్టి ఇండియన్స్‌‌కు పెద్దగా ఇబ్బంది లేదనొచ్చు.