Cricket World Cup 2023: పులులం అంటారు.. పిల్లిలా ఆడతారు: బంగ్లాపై న్యూజిలాండ్ ఘన విజయం

Cricket World Cup 2023: పులులం అంటారు.. పిల్లిలా ఆడతారు:  బంగ్లాపై న్యూజిలాండ్ ఘన విజయం

వన్డే ప్రపంచ కప్ 2023లో న్యూజిలాండ్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను..8 వికెట్ల తేడాతో చిత్తుచేసిన కివీస్ జట్టు వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. బంగ్లా బ్యాటర్లు నిర్ధేశించిన 246 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 43 బంతులు మిగిలివుండగానే చేధించింది. ఈ విజయంతో న్యూజిలాండ్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కూర్చుంది.

రహీం ఒంటరి పోరు

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీం (66) ఒంటరి పోరాటం చేయగా.. ఆ జట్టు కెప్టెన్ షకీబ్ ఉల్ హసన్ (40), మహ్మదుల్లా(41) పరుగులతో పర్వాలేదనిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో లాఖీ పెర్గుసన్ 3 వికెట్లు తీసుకోగా.. ట్రెంట్ బోల్ట్, మ్యాట్ హెన్రీ చెరో 2 వికెట్ల చొప్పున.. గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ స్యాంట్నర్ చెరో వికెట్ తీసుకున్నారు.

ఆడుతూ పాడుతూ..

అనంతరం 246 పరుగుల విజయ లక్ష్యాన్ని కివీస్ బ్యాటర్లు ఆడుతూ పాడుతూ ఛేదించారు. సాధారణ లక్ష్యమే కావడంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రాక్టీస్ మ్యాచ్‌లా ఆడుకుంటూ చేధించారు. బంగ్లా బౌలర్ల పోరాటపటిమ చూసి.. మ్యాచ్ ను వీక్షించిన అభిమానులకు కూడా విసుకొచ్చింది. అంత దారుణంగా బౌలింగ్ చేశారు. డారిల్ మిచెల్ 89 పరుగులు చేయగా.. కేన్ విలియంసన్ 78 పరుగులతో రాణించారు. మరో రెండు మ్యాచ్ ల్లో ఓడితే.. బంగ్లా సెమీస్ ఆశలు దాదాపు ముగిసినట్లే.