మయాంక్‌ బర్త్‌ డే స్పెషల్‌

మయాంక్‌  బర్త్‌ డే స్పెషల్‌

    ఫామ్‌‌లోకి వచ్చిన ఓపెనర్‌‌ అగర్వాల్‌‌

    హాఫ్‌‌ సెంచరీతో రాణించిన రిషబ్‌‌ పంత్‌‌

    న్యూజిలాండ్‌‌ ఎలెవన్‌‌తో వామప్‌‌ మ్యాచ్‌‌ డ్రా

బర్త్‌‌డే బాయ్‌‌ మయాంక్‌‌ అగర్వాల్‌‌ స్పెషల్‌‌ ఇన్నింగ్స్‌‌తో టచ్‌‌లోకి వస్తే.. రిషబ్‌‌ పంత్‌‌ ధనాధన్‌‌ హాఫ్‌‌ సెంచరీతో ఫామ్‌‌ చూపెట్టాడు. ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌లో హనుమ విహారి సెంచరీ చేస్తే, టెస్ట్‌‌ స్పెషలిస్ట్‌‌ పుజారా మంచి స్కోర్‌‌ చేశాడు. పేసర్లు కూడా వికెట్ల వేటలో సక్సెస్‌‌ అయ్యారు. శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ ఫెయిల్యూర్‌‌ మినహా..  న్యూజిలాండ్‌‌ ఎలెవన్‌‌తో డ్రా గా ముగిసిన వామప్‌‌లో టీమిండియాకు మంచి మ్యాచ్‌‌ ప్రాక్టీస్‌‌ దొరికింది.

ఇండియా, న్యూజిలాండ్‌‌ ఎలెవన్‌‌ మధ్య జరిగిన మూడు రోజుల వామప్‌‌ మ్యాచ్‌‌ డ్రా గా ముగిసింది. ఆదివారం 29వ బర్త్‌‌డే చేసుకున్న మయాంక్‌‌  అగర్వాల్‌‌(99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 81 రిటైర్డ్‌‌ ఔట్‌‌)తోపాటు  రిషబ్‌‌ పంత్‌‌(65 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 70) చివరి రోజు ఆటలో హాఫ్‌‌ సెంచరీలు చేయడంతో ఇండియా సెకండ్‌‌ ఇన్నింగ్స్‌‌లో  నాలుగు వికెట్ల నష్టానికి 252 రన్స్‌‌ చేసింది. లంచ్‌‌ బ్రేక్‌‌ అనంతరం  ఓ గంట సేపు ఆడిన తర్వాత ఇరుజట్లు డ్రా కు అంగీకరించడంతో మ్యాచ్‌‌ను ముగించారు. ఓవర్‌‌నైట్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ పృథ్వీ షా(39)తోపాటు శుభ్‌‌మన్‌‌ గిల్‌‌(8) మరోసారి  నిరాశపరిచాడు. వృద్ధిమాన్‌‌ సాహా(30 నాటౌట్‌‌), రవిచంద్రన్‌‌ అశ్విన్‌‌(16 నాటౌట్‌‌) చాన్స్‌‌ను ఉపయోగించుకున్నారు. న్యూజిలాండ్‌‌ ఎలెవన్‌‌ నుంచి తొమ్మిది మంది బౌలింగ్‌‌ చేయగా కెప్టెన్‌‌ డారెల్ మిచెల్‌‌(3/33) మూడు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌‌ ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌లో ఇండియా 263 రన్స్‌‌ చేయగా, న్యూజిలాండ్‌‌ ఎలెవన్‌‌ 235కి ఆలౌటైంది. ప్రాక్టీస్​ సక్సెస్​ కావడంతో ఫస్ట్‌‌ టెస్ట్‌‌ ఆడే తుదిజట్టుపై ఇండియా మేనేజ్‌‌మెంట్‌‌కు కూడా ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ నెల 21 నుంచి  తొలి టెస్టు జరగనుంది.

మయాంక్‌‌ బ్యాక్ టు ఫామ్‌‌

బంగ్లాదేశ్‌‌తో సెకండ్‌‌ టెస్ట్‌‌ నుంచి ఫామ్‌‌ కోసం తంటాలు పడుతున్న ఓపెనర్‌‌ మయాంక్‌‌ అగర్వాల్‌‌ ఎట్టకేలకు గాడిలో పడ్డాడు. తన టెక్నిక్‌‌ విషయంలో తప్పిదాలను సరిచేసుకొని  వామప్‌‌ మ్యాచ్‌‌ ఆఖరి రోజు మంచి ఇన్నింగ్స్‌‌ ఆడాడు.  గత 10 కాంపిటేటివ్‌‌ మ్యాచ్‌‌ల్లో ఆడిన 11 ఇన్నింగ్స్‌‌లో ఒక్కసారి కూడా 40  రన్స్‌‌ మార్కు దాటలేకపోయిన మయాంక్‌‌ తన బర్త్‌‌ డే రోజు సత్తా చూపెట్టాడు. సెడాన్‌‌ పార్క్‌‌ వికెట్‌‌ను బాగా అర్థం చేసుకున్న మయాంక్‌‌ పేస్‌‌ బౌలింగ్‌‌లో స్వేచ్ఛగా ఆడాడు. ఆన్‌‌ డ్రైవ్‌‌లు, పుల్ షాట్‌‌లతో పరుగులు రాబట్టాడు. మరోపక్క  నంబర్‌‌ ఫోర్‌‌లో బ్యాటింగ్‌‌కు వచ్చిన రిషబ్‌‌ పంత్‌‌ కూడా చెలరేగడంతో  స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. స్పిన్నర్లు ఇష్‌‌ సోధీ, హెన్రీ కూపర్‌‌ బౌలింగ్‌‌ను ఈజీగా ఆడిన పంత్‌‌ నాలుగు సిక్సర్లు బాదేశాడు. స్థాయికి తగ్గట్టు ఆడి మేనేజ్‌‌మెంట్‌‌ ఊపిరి పీల్చుకునేలా చేశాడు. పంత్‌‌– మయాంక్‌‌ జోడీ 14.3 ఓవర్లలో వంద రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ నెలకొల్పింది. ఫామ్‌‌లోకి రావడంతో మిగిలిన వాళ్లకు చాన్స్‌‌ ఇచ్చేందుకు లంచ్‌‌ బ్రేక్‌‌ తర్వాత మయాంక్‌‌ బ్యాటింగ్‌‌కు రాలేదు. దీంతో సాహా క్రీజులోకి వచ్చాడు. కొద్దిసేపటికే మిచెల్‌‌ బౌలింగ్‌‌లో కీపర్‌‌ క్లీవెర్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చి పంత్‌‌ వెనుదిరిగాడు. ఆ తర్వాత అశ్విన్‌‌, సాహా జాగ్రత్తగా ఆడి జట్టు స్కోరును 250 దాటించారు. అంతకుముందు  ఓవర్‌‌ నైట్‌‌ స్కోర్‌‌ 59/0తో సెకండ్‌‌ ఇన్నింగ్స్‌‌ కొనసాగించిన ఇండియాకు తొలి గంటలోపే షాక్‌‌ తగిలింది.  పృథ్వీ షాతో పాటు శుభ్‌‌మన్‌‌గిల్‌‌ను న్యూజిలాండ్‌‌ ఎలెవన్‌‌ కెప్టెన్‌‌ డారెల్‌‌ మిచెల్‌‌ స్వల్ప వ్యవధిలో ఔట్‌‌ చేశాడు. మిచెల్‌‌ వేసిన బాల్‌‌ పృథ్వీ బ్యాట్‌‌, ప్యాడ్స్‌‌ మధ్యలో నుంచి వెళ్లి వికెట్లను లేపేయగా.. గిల్‌‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. గిల్‌‌ మరోసారి ఫెయిలవ్వడంతో ఓపెనింగ్‌‌ స్లాట్‌‌లో పృథ్వీకి దాదాపు లైన్‌‌ క్లియర్‌‌ అయ్యింది. రిషబ్‌‌ పంత్‌‌ హాఫ్‌‌ సెంచరీతో ఆకట్టుకున్నప్పటికీ ఫస్ట్‌‌ టెస్ట్‌‌ ఫైనల్‌‌ ఎలెవన్‌‌లో చోటు దొరకకపోవచ్చు. సీనియర్‌‌ వికెట్‌‌కీపర్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ వృద్ధిమాన్‌‌ సాహా వైపే మేనేజ్‌‌మెంట్‌‌ మొగ్గు చూపే చాన్స్‌‌ ఉంది.

‘కొన్ని రోజులగా నేను ఫామ్‌‌లో లేను. అయితే,  జరిగిపోయిన దానిని మార్చలేం. అందువల్ల వాటి గురించి మాట్లాడటం అనవస రం. వామప్‌‌ మ్యాచ్‌‌ సెకండ్‌‌ ఇన్నింగ్స్‌‌లో 81 రన్స్‌‌ చేశా. ఈ కాన్ఫిడెన్స్‌‌తోనే టెస్ట్‌‌ సిరీస్‌‌ ఆడాలనుకుంటున్నా.  బ్యాటింగ్‌‌ కోచ్‌‌ విక్రమ్‌‌ సర్‌‌తో కలిసి చాలాసార్లు చర్చించి నా బ్యాటింగ్‌‌లో తప్పు ఎక్కడ జరుగుతుందో గుర్తించాం. వాటిని సరిచేసుకు నేందుకు శ్రమించాం. ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌లో ఔటైన తర్వాత కూడా నెట్స్‌‌లో చాలా సేపు ప్రాక్టీస్‌‌ చేశా. కష్టానికి తగిన ఫలితం దక్కడంతో ఆనందంగా ఉంది. స్టాన్స్‌‌ విషయంలో ఉన్న లోపాలను సవరించుకున్నా. మిగిలిన వాటి గురించి చెప్పను. ఈ ఇన్నింగ్స్‌‌లో ఆడిన ఆన్‌‌ డ్రైవ్స్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌గా నాకు కావాల్సిన కాన్ఫిడెన్స్‌‌ను ఇచ్చాయి. పృథ్వీతో కలిసి చాలా క్రికెట్‌‌ ఆడా.  మా మధ్య మంచి అండర్‌‌ స్టాండింగ్‌‌ ఉంది.

– మయాంక్‌‌ అగర్వాల్‌‌