మేడిగడ్డ బాధ్యులపై.. క్రిమినల్ చర్యలు తప్పవు

మేడిగడ్డ బాధ్యులపై.. క్రిమినల్ చర్యలు తప్పవు
  •  కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశంలోనేఅతిపెద్ద స్కామ్: ఉత్తమ్
  • రీ డిజైన్ పేరుతో రూ.94వేల కోట్లు ఖర్చు పెట్టారని మంత్రి ఫైర్

జయశంకర్ భూపాలపల్లి/మహదేవపూర్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతి పెద్ద కుంభ కోణం అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి కారణమైన వారిపై క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్యారేజీ పరిశీలించిన తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం వంద రూపాయలకు టెండర్ పిలిచి, 500 రూపాయలకు అంచనాలు పెంచి వేల కోట్లు దండుకున్నదని ఎద్దేవా చేశారు. 

‘‘ప్రాజెక్ట్ కట్టిన తర్వాత మెయింటెనెన్స్ చేయలేదు గానీ.. ఎన్నికల ముందు నీటిని నిల్వ చేసి పబ్లిసిటీ చేసుకున్నరు. రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును బీఆర్ఎస్ సర్కార్ రీ డిజైన్ పేరుతో రూ.94 వేల కోట్లు ఖర్చు పెట్టింది. కనీసం 90 వేల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయింది. అక్టోబర్ 21న ప్రమాదం జరిగితే ఈ రోజు దాకా మేడిగడ్డ కుంగిన ఘటనపై కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామని గొప్పలు చెప్పుకున్నడు’’అని ఉత్తమ్ మండిపడ్డారు. రూ.94 వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మేడిగడ్డ పగుళ్లు కాదు.. రాష్ట్ర ప్రజల గుండె పగుళ్లు : కూనం నేని సాంబశివరావు, సీపీఐ ఎమ్మెల్యే 

మేడిగడ్డ బ్యారేజీకి వచ్చిన పగుళ్లు.. తెలంగాణ ప్రజల గుండెకు వచ్చిన పగుళ్లు అని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. ప్రాజెక్ట్ కోసం ఖర్చు పెట్టిన లక్ష కోట్లు గోదావరిలో పోసినట్టే అని ఆరోపించారు. బ్యారేజీ కడుతున్నప్పుడు రైతులు, నిర్వాసితుల పక్షాన ఎన్నోసార్లు ప్రభుత్వంపై పోరాడామన్నారు. కానీ.. బ్యారేజీ పూర్తయ్యాక రాలేకపోయామని తెలిపారు. ఇప్పుడు ఇలా కూలిపోవడం చూసి బాధేస్తున్నదని అన్నారు. 

ఎన్నో స్కామ్​లు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఎగ్గొడుతున్నదని మాట్లాడటం సిగ్గు చేటని విమర్శించారు. మూడేండ్లలో నిర్మించిన ప్రాజెక్ట్.. మరో మూడేండ్లలో కూలిపోవడం చూస్తే.. డిజైన్​లోనే లోపం ఉన్నట్టు స్పష్టమవుతున్నదన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్​ను పక్కకుపెట్టి కాళేశ్వరం నిర్మించి పబ్లిసిటీ చేసుకున్నారని మండిపడ్డారు.

బీఆర్ఎస్, బీజేపీ దోస్తులే..పొన్నం ప్రభాకర్, మంత్రి

బీఆర్ఎస్, బీజేపీ దోస్తులనే విషయం ఈ రోజు స్పష్టమైందని, శాసన సభ అనుమతితో ఏర్పాటు చేసిన మేడిగడ్డ పరిశీలనకు ఈ రెండు పార్టీలు రాకపోవడమే ఇందుకు నిదర్శనమని రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాజెక్ట అవినీతిపై కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితం అయ్యారని అన్నారు. కేంద్రం ఎందుకు విచారణ చేయలేదో చెప్పాలని నిలదీశారు. లోక్ సభ ఎన్నికల్లో పొత్తు కోసమే బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయని, కాదని చెప్పే ధైర్యం వాళ్లకు ఉందా? అని సవాల్ విసిరారు.