- ఇండియన్ మోటార్ వెహికల్ రూల్స్ సవరించిన కేంద్ర ప్రభుత్వం
- జనవరి1 నుంచే అమల్లోకి నిబంధన
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాలను అరికట్టడంతో పాటు రోడ్డు భద్రతను మెరుగుపర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త చర్యలు చేపట్టింది. ఇండియన్ మోటార్ వెహికల్ రూల్స్ ను సవరించింది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను బుధవారం ప్రచురించింది. దాని ప్రకారం వాహనదారులు ఒక ఏడాదిలో ఐదు లేదా అంతకంటే ఎక్కువసార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే వారి డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ కానుంది.
ఈ రూల్ ఈ ఏడాది జనవరి 1 నుంచే అమలులోకి వచ్చినట్టుగా పరిగణిస్తారు. ఈ విషయంలో ఏడాది కాలం కంటే పాత ఉల్లంఘనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోదు. అయితే, డ్రైవింగ్ లైసెన్స్ ను సస్పెండ్ చేసే ముందు అథారిటీ ముందు వాదన వినిపించుకునే చాన్స్ ఉంటుంది. ఆ తర్వాత లైసెన్స్ ను ఎంత కాలం సస్పెండ్ చేయాలో అథారిటీ నిర్ణయిస్తుంది.
24 ట్రాఫిక్ నేరాలు నోటిఫై
ఓవర్ స్పీడ్, హెల్మెట్, సీటు బెల్టు లేకుండా వెహికల్ నడపడం, ట్రాఫిక్ సిగ్నల్స్ జంపింగ్, బహిరంగ ప్రదేశాల్లో అక్రమ పార్కింగ్, ఓవర్ లోడింగ్, వాహనాన్ని దొంగిలించడం, తోటి ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించడం వంటి 24 ట్రాఫిక్ నేరాలను ప్రభుత్వం నోటిఫై చేసింది. వీటిలో ఐదు ఉల్లంఘనలకు పాల్పడితే లైసెన్స్ సస్పెండ్ చేయనుంది.
కాగా, ఆర్టీవో, డీటీవోలకు లైసెన్స్ ను సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది. ఎంత కాలం సస్పెండ్ చేయాలో ఆ సంస్థలే నిర్ణయిస్తాయి. గతంలో వరుసగా చలాన్లు పడిన వాహనదారుడి లైసెన్స్ ను 3 నెలల నుంచి ఏడాది వరకు సస్పెండ్ చేసేవారు. ఇకపై ఇ– చలాన్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
