కర్నాటక గవర్నర్దీ అదే తీరు..అసెంబ్లీలో ప్రభుత్వ ప్రసంగం చదవకుండా వాకౌట్

కర్నాటక గవర్నర్దీ అదే తీరు..అసెంబ్లీలో ప్రభుత్వ ప్రసంగం చదవకుండా వాకౌట్
  • అసెంబ్లీలో ప్రభుత్వ ప్రసంగం చదవకుండా వాకౌట్​
  • సొంతంగా రాసుకున్న రెండు లైన్లు చదివి వెళ్లిపోయిన గవర్నర్​
  • స్పీచ్​ కాపీలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలున్నాయని అభ్యంతరం!
  • గవర్నర్​ తీరుపై కాంగ్రెస్ తీవ్ర అసహనం.. సభలో నినాదాలు
  • సుప్రీంకోర్టుకు వెళ్లే అంశాన్ని పరిశీలిస్తామన్న సీఎం సిద్ధరామయ్య
  • ఇటీవల తమిళనాడు, కేరళ అసెంబ్లీలోనూ ఇదే సీన్​

బెంగళూరు: తమిళనాడు, కేరళ అసెంబ్లీల్లో మాదిరిగానే కర్నాటకలోనూ సీన్ రిపీట్ అయింది. గురువారం ప్రారంభమైన కర్నాటక అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని చదివేందుకు గవర్నర్ థవార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చంద్ గెహ్లాట్ నిరాకరించారు. ‘ఈ రాష్ట్రం ప్రగతి మార్గంలో నడుస్తున్నది. సమావేశాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా’ అనే రెండు లైన్లు చదివి ప్రసంగాన్ని ముగించి సభ నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన క రాజకీయంగా గందరగోళానికి దారితీసింది. గవర్నర్​ తీరుపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. రెండేండ్లుగా కాంగ్రెస్ సర్కారు రూపొందించిన  ప్రసంగాలనే గవర్నర్ చదివారు.

 ఈసారి మాత్రం చదవకుండా వాకౌట్​ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా ప్రసంగం ఉంటే ఆయన దాన్ని అసెంబ్లీలో చదివేందుకు నిరాకరిస్తారని కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి. ఆయన అసెంబ్లీకి వచ్చే అంశంపైనా చర్చ సాగింది. కానీ ఆయన సభకువచ్చి రెండు మాటలు మాట్లాడి వెళ్లిపోవడంతో దుమారం రేగింది.  ఈ ఘటనతో సభలోనే కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆపేందుకు ప్రయత్నించారు. ఇతర కాంగ్రెస్ సభ్యులు గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రసంగ కాపీలో ఉన్న 11వ పేరాపైనే గవర్నర్​ అభ్యంతరం చెప్పినట్టు తెలిసింది. కేంద్రంలోని బీజేపీ సర్కారు తెచ్చిన ‘జీ రామ్​ జీ’ చట్టాన్ని ప్రసంగంలో ప్రస్తావించారు. కేంద్రం తీరును తప్పుపట్టినట్టు ఉన్న పేరాను మార్చాలని గవర్నర్ ముందే కోరగా.. ప్రభుత్వం నో చెప్పిందని, అందుకే గవర్నర్​ వాకౌట్ చేసినట్టు చెప్తున్నారు.   

సుప్రీంకోర్టుకు వెళ్తాం: సీఎం సిద్ధరామయ్య 

గవర్నర్ తీరుపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 176, 163 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగాన్ని గవర్నర్ చదవాల్సిందేనని అన్నారు.  దీనిపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామన్నారు. కాగా, త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, కేరళతోపాటు తాజాగా కర్నాటకలోనూ ఇదే సీన్ రిపీట్ కావడం చర్చనీయాంశం అయింది.