- ఉపాధి హామీ’ విషయంలో కేంద్రం కుట్రలపై గ్రామ సభల్లో తీర్మానం
- ఫిబ్రవరి 3 నుంచి రేవంత్ జిల్లా పర్యటనలు
- మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఫిబ్రవరి 3 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనల షెడ్యూల్ ను ఖరారు చేసుకున్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ నెల 28 నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించడం, ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రకు మోదీ సర్కార్ పాల్పడుతున్నారని ఆరోపిస్తూ గ్రామ సభల్లో తీర్మానం చేయించేందుకు మహేశ్ గౌడ్, మీనాక్షి నటరాజన్ పలు జిల్లాల్లో నిర్వహించే గ్రామ సభల్లో పాల్గొననున్నారు. ఈ ముగ్గురు ముఖ్య నేతలు జిల్లాల పర్యటనలకు వెళ్తుండటంతో కాంగ్రెస్ కేడర్లో జోష్ రానున్నది.
పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలుచుకున్న ఊపులో ఉన్న కాంగ్రెస్ నేతలు... వచ్చే నెల్లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ అత్యధిక సీట్లను గెలుచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజా పాలనకు జనం ఆమోదం ఉందని మరోసారి చెప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ కీలక నేతలంతా హైదరాబాద్ సిటీని వీడి జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఈ టూర్లలో స్థానిక నేతల మధ్య ఉన్న బేదాభిప్రాయాలను తొలగించి, వారి మధ్య సమన్వయం కుదర్చడం, ముఖ్యంగా బీఆర్ఎస్ కు చెందిన ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పాత.. కొత్త నేతలను కలుపుకొని పోయేలా కీలక నేతలు తమ టూర్లు ప్లాన్ చేసుకున్నారు. ఇటు సీఎం రేవంత్, అటు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పార్టీ ఇన్చార్జీ జిల్లాల టూర్లతో రాష్ట్ర కాంగ్రెస్ కేడర్లో కొత్త ఊపు రానున్నదని పార్టీ వర్గాలు అంటున్నాయి.
