- మరో విజయంపై సూర్యసేన గురి.. రా. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
రాయ్‌పూర్: టీ20 ఫార్మాట్‌లో తిరుగులేని ఆటతో అదరగొడుతున్న టీమిండియా మరో విజయంపై కన్నేసింది. సొంతగడ్డపై జరిగే వరల్డ్ కప్ చివరి సన్నాహకాల్లో ఉన్న ఆతిథ్య జట్టు న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగే రెండో మ్యాచ్‌లోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఫస్ట్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ మెరుపు బ్యాటింగ్‌తో గ్రాండ్ విక్టరీ అందుకున్న సూర్యకుమార్ సేన అదే జోరును రాయ్‌పూర్‌లోనూ కొనసాగించి సిరీస్‌లో 2–0తో ముందంజ వేయాలని చూస్తోంది. మరోవైపు, వన్డే సిరీస్ విజేతగా నిలిచిన కివీస్ షార్ట్ ఫార్మాట్‌లోనూ పుంజుకుని లెక్క సమం చేయాలన్న పట్టుదలతో ఉంది.
ఆ ఇద్దరిపైనే ఫోకస్
వచ్చే నెలలో జరిగే టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఇండియాకు ఇదే చివరి సిరీస్. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న ఇండియా తన ప్రతి వ్యూహాన్ని కివీస్‌పై పరీక్షిస్తోంది. ఈ సిరీస్ జట్టుకు ఎంత ముఖ్యమో, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వ్యక్తిగత కెరీర్‌కు కూడా అంతే కీలకం. గత కొంతకాలంగా జట్టులో స్థానం కోసం పోరాడుతున్న శాంసన్‌కు ఇప్పుడు ఓపెనర్‌గా సుస్థిరమైన బాధ్యత దక్కింది. అయితే తొలి మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే ఔటవడం అతనికి నిరాశ కలిగించింది. వరల్డ్ కప్ తుది జట్టులో తన స్థానాన్ని ఖాయం చేసుకోవాలంటే, రాయ్‌పూర్‌లో శాంసన్ భారీ ఇన్నింగ్స్ ఆడటం తప్పనిసరి. ఇక, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్‌ను కాదని మేనేజ్‌మెంట్ ఇషాన్ కిషన్‌పై నమ్మకం ఉంచింది.
ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే టోర్నీలో దంచికొట్టి టీమ్‌లో రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్.. నాగ్‌పూర్‌లో మాత్రం విఫలమయ్యాడు. సిరీస్‌లో తన మార్కు చూపెట్టకపోతే.. వరల్డ్ కప్‌లో తిలక్ వర్మ కోసం దారి వదలాల్సి ఉంటుంది. లెఫ్టాండ్ బ్యాటర్ కావడంతో మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో కిషన్ పాత్ర కీలకం కానుంది. ఇక, మెగా టోర్నీ ముంగిట కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌పైనా ఫోకస్ ఉంది. చాన్నాళ్లుగా నిరాశపరుస్తున్న సూర్య.. గత పోరులో 32 రన్స్ చేయడం కాస్త ఊరటనిచ్చే అంశమే. అయితే సూర్య తనదైన స్టయిల్లో చెలరేగి ఫామ్ అందుకుంటే అతనితో పాటు టీమ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఇక, తొలి మ్యాచ్‌లో దంచికొట్టిన అభిషేక్ శర్మపై మరోసారి భారీ అంచనాలున్నాయి. జట్టులో రీఎంట్రీ ఇచ్చిన రింకూ సింగ్ లోయర్ ఆర్డర్‌లో అదరగొట్టడం శుభసూచకం. హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ పాత్రకు న్యాయం చేస్తుండగా బౌలింగ్‌లో అర్ష్‌దీప్, బుమ్రా పేస్ బాధ్యతలు పంచుకుంటున్నారు. స్పిన్నర్లు కూడా సత్తా చాటుతున్నారు. గత మ్యాచ్‌లో చేతి వేలి గాయానికి గురైన అక్షర్ ప్లేస్‌లో హర్షిత్ రాణా బరిలోకి దిగొచ్చు. ఓవరాల్‌గా తొలి మ్యాచ్ జోరును కొనసాగిస్తే ఇండియాకు తిరుగుండదు.
బౌలింగ్‌పై కివీస్ బెంగ
న్యూజిలాండ్ జట్టు పోరాట పటిమకు మారుపేరు. అయితే టీ20ల్లో ఇండియా బ్యాటర్ల విధ్వంసాన్ని అడ్డుకోవడంలో బ్లాక్‌క్యాప్స్ టీమ్ బౌలర్లు విఫలమవుతున్నారు. జాకబ్ డఫీ, కైల్ జేమీసన్ వంటి పేసర్లు రన్స్ నియంత్రించలేకపోతున్నారు. మిచెల్ శాంట్నర్ నేతృత్వంలోని స్పిన్ విభాగంపై భారం ఎక్కువగా ఉంది. గత పోరులో గ్లెన్ ఫిలిప్స్ మినహా మిగిలిన బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. ముఖ్యంగా డెవాన్ కాన్వే తన ఫామ్‌ను తిరిగి అందుకోవాల్సి ఉంది. ఏదేమైనా బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణిస్తేనే కివీస్ లెక్క సరి చేయగలదు.
మంచుతో టెన్షన్
రాయ్‌పూర్ స్టేడియం వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. కానీ ఇక్కడ బౌండరీల సైజు పెద్దదిగా ఉండటం వల్ల బ్యాటర్లకు సిక్సర్లు కొట్టడం అంత సులభం కాదు. ఇక రాత్రి పూట మంచు రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసే జట్టుకు ఇబ్బందిగా మారుతుంది. దాంతో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కు మొగ్గు చూపొచ్చు.
