అంబులెన్స్ సిబ్బందిపై క్రిమినల్ కేసు నమోదు

అంబులెన్స్ సిబ్బందిపై క్రిమినల్ కేసు నమోదు

మోసం చేసిన అంబులెన్స్ నెంబర్: ఏపీ 21 టీయూ 9103

ఫోన్ పే ద్వారా 50వేలు తీసుకున్నది డ్రైవర్ పట్టం సురేష్ కుమార్ గా గుర్తింపు

పరారీలో ఉన్న అంబులెన్స్ సిబ్బంది కోసం రంగంలోకి దిగిన పోలీసులు

కరోనా పేరుతో మోసం చేసిన తీరు క్షమార్హం కాదు:  జిల్లా కలెక్టర్ వీర పాండియన్

కరోనా పేరుతో ఎలాంటి మోసాలకు పాల్పడినా చర్యలు కఠినంగా ఉంటాయి: కలెక్టర్

కర్నూలు: కరోనాతో చనిపోయాడంటూ..  మభ్యపెట్టి అంత్యక్రియలకు డబ్బులు వసూలు చేసిన అంబులెన్స్ సిబ్బందిపై కర్నూలు  మూడవ పట్టణ పోలీసులు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వ్యవహారం మీడియా ద్వారా తెలుసుకున్న జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ వెంటనే విచారణకు ఆదేశించారు. సీఎం పర్యటన కోసమంటూ శ్రీశైలం వెళ్లిన జిల్లా కలెక్టర్ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంబులెన్స్ సిబ్బంది మోసం చేసిన వ్యవహారంపై ఆధారాలు లభించడంతో స్పందించిన ఆయన ఇలాంటి ఘటనను మానవమాత్రులెవరూ చేయకూడనిదని.. వారిని ఉపేక్షించరాదన్నారు. బాధితులు ఎక్కడున్నా వెంటనే పట్టుకుని అరెస్టు చేయాలని ఆదేశించారు. క్రిమినల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కి సూచించారు.

మీడియాలో వ్యవహరం రచ్చ కావడంతో కర్నూలు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికార యంత్రాంగం పరుగులు పెట్టింది. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రితోపాటు జిల్లా వ్యాప్తంగా అంబులెన్స్ సిబ్బందినందరినీ విచారించారు. ఈనెల 14వ తీదీన కర్నూలు నగరంలోని బి.క్యాంప్ ఆరోరా నగర్ కు చెందిన కె.సాయినాథరావు (67)కు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ప్రైవేటు అంబులెన్స్ లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స ప్రారంభించేలోపే చనిపోయాడు. నిరక్షరాస్యురాలైన భార్య.. సమీప బంధువులెవరూ లేకపోవడం గుర్తించిన అంబులెన్స్ సిబ్బంది.. కరోనా తో చనిపోయాడంటూ మభ్యపెట్టారు.  ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో ఉంటున్న మృతునికి కొడుకు క్రాంతి కిరణ్ తో అంబులెన్స్ సిబ్బందితో ఫోన్ లో మాట్లాడారు. అంత్యక్రియలను కాల్చి జరపాలంటే 85 వేలు.. పూడ్చాలంటే.. 75 వేలు అవుతుందని డిమాండ్ చేశారు. కరోనా పాజిటివ్ కాబట్టి శవాన్ని వెంటనే తరలించాలని తొందరపెట్టారు. చనిపోయిన సాయినాధరావు భార్య వద్ద ఉన్న 35 వేలు తీసుకున్నారు. విదేశాల్లోని కొడుకు క్రాంతి కిరణ్  ఫోన్ పే ద్వారా 50 వేలు తీసుకున్న పట్టం సురేష్ కుమార్ అంబులెన్స్ లో శవాన్ని తీసుకెళ్లిపోయాడు. నాలుగు రోజుల తర్వాత డెత్ సర్టిఫికెట్ కోసం వెళ్లిన బంధువులు తెచ్చిన డాక్టర్ సర్టిఫికెట్ తో అంబులెన్స్ సిబ్బంది మోసం చేసిన వైనం బయటపడింది. దాన్ని మృతుడి బంధువులు సోషల్ మీడియాలో పెట్టడం వైరల్ అయింది. చివరి చూపునకు కూడా నోచుకోకుండా తమకు చేసిన అన్యాయం మరొకరికి జరగకూడదని ఆవేదన వ్యక్తం చేస్తున్న కొడుకు కాంతి కిరణ్ వీడియో సందేశం దుమారం రేపింది. మోసం చేసిన అంబులెన్స్ సిబ్బందినపై క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు వేట ప్రారంభించారు.