
ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభంతో ఈ మూడేళ్లలో మొట్టమొదటిసారి గృహ రుణాలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం హౌసింగ్ ఫైనాన్స్ గ్రోత్ 13–15 శాతానికి తగ్గిపోనుందని తాజా రిపోర్ట్ అంచనావేసింది. గత మూడేళ్లలో సగటున ఇదే కనిష్ట స్థాయి అని పేర్కొంది. గృహ రుణాలు కనిష్ట స్థాయిలకు పడిపోవడానికి ప్రధాన కారణం నాన్ బ్యాంకింగ్ లెండర్స్‌కు లిక్విడిటీని కఠినతరం చేయడమేనని రిపోర్ట్ తెలిపింది. ఇది అవుట్‌స్టాండింగ్ హౌసింగ్ క్రెడిట్‌పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని రేటింగ్ ఏజెన్సీ ఐక్రా తన వీకెండ్ రిపోర్ట్‌లో తెలిపింది. 2019 మార్చి చివరి నాటికి అవుట్‌స్టాండింగ్ హౌసింగ్ క్రెడిట్ రూ.19.1 లక్షల కోట్లుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆర్థిక వృద్ధికి హౌసింగ్ సెక్టార్ కీలకమైనదిగా ఉంటోందని రిపోర్ట్ వివరించింది.
13 శాతం లేదా 15 శాతానికి తగ్గిపోనున్న ఈ హౌసింగ్ క్రెడిట్ వృద్ధి, గత మూడేళ్లలో 17 శాతంగా నమోదైనట్టు రిపోర్ట్ చెప్పింది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల మొత్తం ఇండస్ట్రీ లోన్ గ్రోత్ 2018 ఆర్థిక సంవత్సరంలో కూడా15 శాతానికి తగ్గిపోయింది. గత సెప్టెంబర్ నుంచి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్, రిలయన్స్ క్యాపిటల్, ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ లాంటి కంపెనీలు సతికిల పడ్డాయి. దీంతో క్రెడిట్ గ్రోత్ కూడా మందగించింది. ఇదే సమయంలో బ్యాంక్‌లు 19 శాతం మేర పుంజుకున్నాయి. మొత్తం మార్కెట్ షేరులో కూడా బ్యాంక్‌లు 64 శాతం చేజిక్కించుకోనున్నట్టు రిపోర్ట్ చెప్పింది. అంతకుముందు ఇది 62 శాతంగా ఉన్నట్టు పేర్కొంది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో కూడా బ్యాంక్‌లు వృద్ధి బాటలోనే నడువనున్నాయని పేర్కొంది. అయితే గృహ రుణాల వృద్ధి కోలుకుంటుందని ఐక్రా అంచనావేస్తోంది.
మొత్తం హౌసింగ్ ఫైనాన్స్‌లో స్థూల ఎన్‌పీఏల రేషియో 2019 మార్చి నాటికి 1.5 శాతానికి పెరిగింది. కొంతమంది డెవలపర్లు సమస్యలు ఎదుర్కొంటూ ఉండటంతో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల మొత్తం ఎన్‌పీఏలు 1.8 శాతం వరకు పెరగనున్నట్టు ఐక్రా అంచనా వేస్తోంది. అయితే చౌకైన కొత్త ఇళ్ల సెగ్మెంట్‌లో ఎన్‌పీఏలు కాస్త తగ్గాయి. 2018 డిసెంబర్ నాటికి 5 శాతంగా ఉన్న ఈ ఇళ్ల సెగ్మెంట్ ఎన్‌పీఏలు, 2019 మార్చి నాటికి 4.6 శాతానికి చేరినట్టు ఐక్రా చెప్పింది. కొన్నింటిని రైటాఫ్స్ చేయడం, మరికొన్ని ఎన్‌పీఏలను అమ్మడం చేసినట్టు వివరించింది. 10 శాతం నుంచి 14 శాతం వృద్ధిని చేరుకోవాలంటే 2020 ఆర్థిక సంవత్సరంలో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు రూ.4 లక్షల కోట్ల నుంచి రూ.4.5 లక్షల కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని ఐక్రా అంచనావేస్తోంది.