రాజన్న సిరిసిల్ల జిల్లాలో పానీపూరీ ఘటనలో కీలక పరిణామం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పానీపూరీ ఘటనలో కీలక పరిణామం

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పానీపూరీ ఘటనపై అధికారులు దర్యాప్తు చేశారు. జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశాలతో విచారణ చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లి కేసీఆర్ నగర్‌లో పానీపూరీ తిని అస్వస్థతకు గురైన చిన్నారుల ఘటనపై చర్యలు తీసుకున్నారు. తంగళ్లపల్లిలోని మోహన్ లాల్ చాట్ బండార్‌పై కేసు నమోదు చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు పానీపూరీ నమూనాలను సేకరించారు. నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.

పానీపూరీ తిని పలువురు చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం కేసీఆర్ నగర్‌‌‌‌‌‌‌‌లో ఓ బండి వద్ద పానీపూరీ తిన్న చిన్నారులు రాత్రి నుంచే అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం నుంచి కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు వారిని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాదాపు 20 మంది చిన్నారులు అస్వస్థతకు గురైనట్లు తొలుత తెలిసింది.

ALSO READ : ఠాగూర్ మూవీ సీన్ రిపీట్.. 

కేసీఆర్ నగర్‌‌‌‌‌‌‌‌లో పానీపూరీ అమ్మిన వ్యక్తే అంకుశాపూర్ గ్రామంలో కూడా పానీపూరీ విక్రయించినట్లు స్థానికులు తెలిపారు. బుధవారం అంకుశాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు, కేసీఆర్ నగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన మరో బాలుడు ఫుడ్ పాయిజనింగ్‌‌‌‌‌‌‌‌కు గురయ్యారు. దీంతో బాధితుల సంఖ్య 24కు చేరింది. ఇందులో రిషికేష్ అనే బాలుడికి తీవ్ర జ్వరంతో ఫిట్స్ వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం 8 మంది చిన్నారులు చికిత్స పొందుతుండగా, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.