ఈ చలాన్లపై వెల్లువెత్తుతున్న విమర్శలు

ఈ చలాన్లపై వెల్లువెత్తుతున్న విమర్శలు

ఖమ్మం జిల్లాలో పోలీసుల ఈ చలాన్లపై  విమర్శలు వస్తున్నాయి. ఒక్క హెల్మెట్ మీదే పోలీసులు ఫోకస్ పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. హెల్మెట్ లేని వారికి నెలలో రెండూ మూడుసార్లు ఫైన్ వేస్తూ… ట్రిపుల్ రైడింగ్, అతివేగం, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిని పట్టించుకోవడం లేదంటున్నారు జనం. మద్యం తాగి వాహనాలు నడుపుతున్నా పోలీసులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారంటున్నారు. హెల్మెట్ లేని వారికి వేస్తున్న ఫైన్లపైనే ఎక్కువ ఆదాయం వస్తోందంటున్నారు. 2016లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 931 ప్రమాదాలు జరిగాయి.  316 మంది చనిపోయారు. 1094 మంది గాయపడ్డారు. 2018లో నవంబరు నెలాఖరు వరకు రోడ్డు ప్రమాదాల్లో 280 మంది మృతిచెందారు. 930 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదాలన్నీ ప్రధాన రహదారుల్లోనే జరిగాయి. బయట ప్రాంతాలను పట్టించుకోకుండా పోలీసులు ఖమ్మంలో హెల్మెట్ పై స్పెషల్ డ్రైవ్  మాత్రమే నిర్వహిస్తున్నారన్న  విమర్శలున్నాయి.

ఉమ్మడి జిల్లాలో 12 ప్రధాన రోడ్లలోని 166 స్పాట్ లను ఎక్కువ ప్రమాదాలు జరిగేవిగా గుర్తించారు. ఇందులో ఖమ్మం-కోదాడ రహదారిలో వరంగల్  క్రాస్ రోడ్ , గుర్రాలపాడు, ముదిగొండ దగ్గర, నేలకొండపల్లి మలుపు ఉన్నాయి. బోనకల్  రహదారిలో అగ్రహారం , నాగులవంచ, ఖమ్మం- మహబూబాబాద్  రహదారిలో కాచిరాజుగూడెం, వెంకటాయపాలెం ప్రాంతాలు ఉన్నాయి.తిరుమలాయపాలెం రహదారిలో కొండాపురం, పాతర్లపాడు, ఖమ్మం- సూర్యాపేట రహదారిలో కూసుమంచి, తల్లంపాడు, కొత్తగూడెం-విజయవాడ రహదారిలో చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, ఇల్లెందు- కొత్తగూడెం రహదారిలో టేకులపల్లి, ముత్యాలంపాడు, అనిశెట్టిపల్లిని డుంజర్ స్పాట్లుగా గుర్తించారు.

పాల్వంచ-కొత్తగూడెం రహదారిలో మూడు ప్రాంతాలు, భద్రాచలం క్రాస్  రోడ్ – మణుగూరు రహదారిలో మూడు స్పాట్లు, ఖమ్మం- ఇల్లెందు రహదారిలో కారేపల్లి క్రాస్ రోడ్ , ఊట్కూరు ప్రాంతాలను ప్రమాదాలు జరిగేవిగా గుర్తించారు.ఈ  ప్రాంతాల్లో స్పెషల్  డ్రైవ్  నిర్వహించకుండా.. నగరం లోపల ఫైన్లు వేయడం వల్ల ప్రమాదాల నివారణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు జనం. ఖమ్మంలో హెల్మెట్  తో డ్రంక్ అండ్ డ్రైవ్, స్పీడ్ డ్రైవింగ్ చేసేవారిపై ఫైన్ వేస్తున్నామంటున్నారు పోలీసు అధికారులు. బైపాస్ రోడ్డు దగ్గర సీసీ కెమెరాల ఆధారంగా ఈ-చలానా వేస్తున్నామని చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రహదారులపై డేంజర్ స్పాట్ల దగ్గర పోలీసులు ఫోకస్ పెడితే రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందంటున్నారు జనం.