- రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
హనుమకొండ, వెలుగు: పంటల మార్పిడితోనే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకుపైగా వరి, పత్తి మాత్రమే పండిస్తున్నారని, దీంతో మార్కెటింగ్ విషయంలో ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు.
హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా బుధవారం రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వ లీడర్లు, అధికారులు ప్రజలతో మమేకమైన సందర్భాలు లేవన్నారు. ఇప్పుడు 99 రోజుల ప్రత్యేక ప్రణాళికతో లీడర్లు, ఆఫీసర్లు, శాస్త్రవేత్తలు రైతులతో మమేకం అవుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తోందని విమర్శించారు.
వ్యవసాయంలో పెనుమార్పులు, సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే కేరళ, మహారాష్ట్ర, ఇతర జిల్లాల్లో పర్యటించి పంటల మార్పిడి విధానంపై సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక అందించినట్లు తెలిపారు. సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ విత్తన కంపెనీలు పుట్టగొడుగుల్లా వెలిశాయని, ఆ విత్తనాలతో దిగుబడి అంతంత మాత్రంగానే వస్తోందన్నారు. ప్రభుత్వం 8 రకాల సన్న, 3 రకాల దొడ్డు వరి విత్తనాలు మాత్రమే రికమండ్ చేస్తోందని, వాటిని మాత్రమే సాగు చేయాలని సూచించారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా 16 లక్షల ఎకరాల్లో మక్కలు సాగు చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో మొత్తం పంటను కొనుగోలు చేయడం ఏ ప్రభుత్వానికైనా సాధ్యం కాదన్నారు. ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగుతో రైతులు అధిక లాభాలు సాధించవచ్చన్నారు. కోతుల బాధ, దొంగల బెడద, మార్కెట్ ఇబ్బందులు ఉండవని చెప్పారు. వ్యవసాయ కమిషన్ సభ్యుడు గోపాల్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ నాయకులు వెంకటరెడ్డి, సురేందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, రమణ పాల్గొన్నారు.
