 
                                    - కాల్వొడ్డు దగ్గర 26 అడుగుల మేర మున్నేరు ప్రవాహం
- లోతట్టు ప్రాంతాలు జలమయం
- 227 మందిని పునరావాస కేంద్రాలకు తరలింపు
- బాధితులను పరామర్శించిన మంత్రి తుమ్మల, కలెక్టర్ అనుదీప్
ఖమ్మం, వెలుగు: జిల్లాలో మొంథా తుఫాన్ కారణంగా 43,104 మంది రైతులకు చెందిన 62,400 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 36, 893 ఎకరాల్లో వరి, 22,574 ఎకరాల్లో పత్తి, 2,923 ఎకరాల్లో మిర్చి, 10 ఎకరాల్లో కంది పంటకు నష్టం జరిగిందని గుర్తించారు. ఇక జిల్లాలో తుఫాన్ కారణంగా బుధవారం రోజంతా వర్షం కురిసినా, గురువారం గ్యాప్ ఇచ్చింది.
కాల్వొడ్డు దగ్గర మున్నేరు గరిష్టంగా 25.8 అడుగుల మేర వరద ప్రవాహం వచ్చింది. స్వల్పంగా ఇంకొక అడుగు మేర పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. గతేడాది దాదాపు 38 అడుగుల మేర వరద రాగా, ఈసారి అంతకంటే తక్కువగానే ఉండడంతో స్థానికులతో పాటు ఆఫీసర్లు ఊపిరిపీల్చుకున్నారు.
ఉప్పొంగిన వాగులు..
తుఫాన్ ప్రభావంతో ఖమ్మంలో కొద్దిపాటి వర్షాలు మాత్రమే పడినా, మున్నేరు, ఆకేరుకు ఎగువ ప్రాంతాలైన మహబూబాబాద్, జనగామ, హనుమకొండ, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షం పడడంతో ఆయా వాగులు పోటెత్తాయి. మున్నేరు సామర్థ్యం మూడున్నర లక్షల క్యూసెక్కులకు గానూ, ఈసారి 1.65 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహం వచ్చింది.
ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో ఖమ్మం జిల్లాలో 1061 చెరువులకు గానూ 460 అలుగు పోస్తున్నాయి. 492 చెరువులు 90 శాతం నుంచి 100 శాతం వరకు నిండగా, 77 చెరువులు 75 శాతం నుంచి 90 శాతం వరకు, 25 చెరువులు 50 శాతం నుంచి 75 శాతం వరకు, 2 చెరువులు 25 శాతం నుంచి 50 శాతం వరకు, 5 చెరువులు 25 శాతం వరకు నిండాయి.
ఇక పాలేరు రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 23 అడుగులు కాగా, 25.10 అడుగుల మేర నీటిమట్టం ఉండి అలుగుపారుతోంది. వైరా రిజర్వాయర్ 18.03 అడుగులకు గాను 20.04 అడుగులు ఉండి అలుగు పోస్తుండగా, లంకా సాగర్ ప్రాజెక్టులో 16 అడుగులకు పూర్తి స్థాయి నీటిమట్టానికి గాను 16.04 అడుగుల మేర నీరు రావడంతో అలుగుపోస్తోంది.
ముంపు ప్రాంతాల నుంచి రిలీఫ్ క్యాంపులకు..
లోతట్టు కాలనీలు జలమయం కావడంతో బుధవారం సాయంత్రమే బాధితులను రిలీఫ్ క్యాంపులకు తరలించారు. ఖమ్మం నగరంలో 90 కుటుంబాలకు చెందిన 227 మంది సభ్యులను ధంసలాపురం స్కూలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, నయాబజార్ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు.
గురువారం నయాబజార్ స్కూల్, నయాబజార్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తనిఖీ చేశారు. ప్రజలకు కల్పించిన వసతులు, భోజనం నాణ్యత, హెల్త్ క్యాంప్ ను పరిశీలించారు. స్ధానికంగా ఉన్న ప్రజలతో మాట్లాడి అక్కడ సమకూర్చిన సౌకర్యాలపై ఆరాతీశారు.

 
         
                     
                     
                    